దిగుబడి దిగులు
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:39 AM
వరి చేలు కోత దశకు వస్తున్న నేపథ్యంలో దిగుబడిపై రైతు దిగులుతో ఉన్నాడు.
సాగు ఆరంభం నుంచి ముంపు.. తెగుళ్లు
జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో సాగు
మెట్ట ప్రాంతంలో పీఆర్ 126 రకం ఎకరాకు 35 బస్తాల లోపే..
డెల్టా ప్రాంతంలో సాగు పరిస్థితి ఇదే..
వరి చేలు కోత దశకు వస్తున్న నేపథ్యంలో దిగుబడిపై రైతు దిగులుతో ఉన్నాడు. సార్వా ఆరంభంలోనే ప్రకృతి ప్రతికూలించడంతో అన్నదాత కుదేలయ్యాడు. వర్షాలు, వరదలతో నారు, నాట్లు నీట మునిగి దెబ్బ తిన్నాడు. తిరిగి నారు, నాట్లు వేయడంతో సాగు జాప్యమైంది. తెగుళ్ల తాకిడితో రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ దశలో కొందరు సాగు విరమించుకున్నారు. సాగు చేసిన వారు దిగుబడి తగ్గుతుందని ఆందోళనలో ఉన్నారు.
భీమవరం రూరల్, అక్టోబరు 9: సార్వా సీజన్ రైతులను భయపెడుతోంది. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే దిగుబడులు సాగుతున్నాయి. ఎకరాకు 35 బస్తాలలోపు ధాన్యం దిగుబడి తో రైతులు కుదేలయ్యారు. డెల్టా ప్రాంతంలో ఇంతకంటే తక్కువ పంట పండతుందని రైతులు దిగులుతో ఉన్నారు. మెట్ట ప్రాంతంలో గతంలో కంటే 5 బస్తాలు నుంచి 10 బస్తాలు వరకు దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో తుఫాన్, అల్పపీడనాల ప్రభావం పెద్దగా లేకపోయినా దిగుబడి తగ్గింది. డెల్టా ప్రాంతంలో వర్షాల దెబ్బ వరి చేలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆ లెక్కన డెల్టా సాగుపై పంట దిగుబడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. రైతులు కష్టంతో పాటు నష్టం మూటకట్టుకోవాల్సిందే.
అంచనా దొరకని పంట
సార్వా సాగులో పంట దిగుబడి అంచనాపై అధికారులు లెక్కలు వేయలేదు. సాగు తీరు పూర్తిగా మారింది. ముందు, వెనుక సాగుతో దిగుబడిలో వత్యాసం ఎక్కువ ఉంటుంది. దానికి తోడు 8వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. 25 వేల ఎకరాల్లో రెండుసార్లు పిలకతొడిగే దశలో ముంపు బారినపడ్డాయి. తేరుకున్నా ఎకరానికి 20 బస్తాల దిగుబడి వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. 15 వేల ఎకరాల్లో సాగు జరగలేదు. వీటన్నింటిని లెక్కగట్టి దిగుబడి అంచనా వేయ డం సాధ్యం కాలేదు. జిల్లాలో సార్వా దిగుబడి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల అనేది మాసూళ్లు పూర్తయ్యాకే తేలనుంది.
పీఆర్ 126 రకం 35 బస్తాల దిగుబడి
జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో సార్వా సాగు చేస్తే మెట్ట ప్రాంత సాగు 16 వేల ఎకరాలు వరకు ఉంది. ఇక్కడ పీఆర్ 126 రకం 3వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం రెండువేల ఎకరాల వరకు మాసూళ్లు అయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం ఎకరాకు 35 బస్తాల దిగుబడి వస్తోంది. నెమ్ము ధాన్యం కనుక ఆరుదలతో ఇంకా బస్తాలు తగ్గుతాయి. గతం కంటే పీఆర్ 126 రకం దిగుబడి తగ్గింది. మిగిలిన సాగు తగ్గే అవకాశం ఉంటుంది. సార్వాసాగుకు వర్షాల దెబ్బ పెట్టుబడి పెరిగేలా చేసింది. అధిక వర్షాలతో నారుమడులు దెబ్బతినడంతో మరో సారి నారుమడులు వేశారు. నాట్లు దెబ్బతిన్న చోట మళ్లీ నాట్లు వేయక తప్పలేదు. నారు కొనుగోలుతో కొంతసాగు జరిగింది. దీంతో జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఎకరానికి రూ.5వేలు వరకు పెట్టుబడి అధికమైందని రైతులు చెబుతున్నారు. తీరా దిగుబడి ఆశాజనకంగా లేవని రైతులు అంటున్నారు. రోజులు ఎక్కువైన నారు ఉపయోగించడం, ఎండాకు తెగులు దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
నవంబర్ మొదటి వారంలో మాసూళ్లు
ఈ ఏడాది సార్వాసాగు మాసుళ్ళు నవంబర్ మొదటి వారం నుంచే ముమ్మరంగా సాగుతాయనే వ్యవసాయాధికారులు అంచనా వేశారు. డెల్టాలో వర్షాలు దెబ్బ నాట్లు ఆలస్యానికి దారి తీసింది. దీంతో పంట మాసుళ్ళు వెనక్కు వెళ్ళాయి. మరికొన్ని ప్రాంతాలలో మరింత వెనక్కి మాసుళ్ళు జరుగతాయని రైతులు అంటున్నారు.