పైడిచింతపాడులో ఉద్రిక్తం
ABN , Publish Date - Nov 02 , 2024 | 12:55 AM
ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. పైడిచింతపాడులో గురువారం ఉదయం సామా జిక పింఛన్ పంపిణీలో జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం రేగింది.
టీడీపీ, జనసేన నాయకుల మధ్య వర్గవిభేదాలు
పింఛన్ల పంపిణీ సందర్భంగా పరస్పర దాడులు
ఏలూరు రూరల్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. పైడిచింతపాడులో గురువారం ఉదయం సామా జిక పింఛన్ పంపిణీలో జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం రేగింది. ఇదికాస్త చినికి చినికి గాలివానలా మారి కొట్లాటకు దారితీసింది. కొట్లాటలో ఇరువర్గాల నాయకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు.
గ్రామంలో గురువారం ఉదయం టీడీపీ నాయకులు దగ్గరుండి పింఛన్‌లు అందించేందుకు పూనుకున్నారు. ఈ విషయం ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన నాయకులు తమకు సమాచారం అందించకుండా పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ టీడీపీ నాయకులు ప్రశ్నించడంతో జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాటకు దారితీసింది. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన నాటి నుంచి గతనెల కూడా పింఛన్ పంపిణీ విషయంలో ఆధిపత్య పోరు నడిచింది. అక్టోబరు ఒకటో తేదీన సైతం ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తిరిగి అదే విషయంపై పునరావృతమైంది. ఇరువర్గాల నాయకులు సచివాలయం బయటకు వచ్చి కొట్లాడుకున్నారు. గ్రామంలో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీమూకలతో జనసేనలో చేరి పెత్తనం చెలాయిస్తే ఊరుకోమని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్‌ఫికెట్ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఏలూరు ఎంపీడీవో శ్రీలత అక్కడకు చేరుకుని సచివాలయ సిబ్బంది చేత పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీ –జనసేన మధ్య పరస్పర దాడులు ఇరువర్గాల నేతల మధ్య పొత్తుధర్మం లేకపోవడంపై ఆయా పార్టీ నాయకులు అధినేతలకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అయ్యారు.
11 మందిపై కేసు..
ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సైదు నాగరాజు ఫిర్యాదు మేరకు జనసేన నాయకులైన ముంగర వెంకటేశ్వరరావు, మురార్జీ, రాంపండు, రంగబాబు తదితరులు మొత్తం పదకొండు మందిపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైదు నాగరాజును దెందులూరు ఎమెమల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.