టీడీపీ సభ్యత్వ నమోదులో పాలకొల్లు ప్రథమం
ABN , Publish Date - Dec 12 , 2024 | 12:32 AM
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఉత్తేజం ఏమాత్రం తగ్గకుండా సభ్యత్వ నమోదులో తీసుకున్న చర్యలతో క్షేత్రస్థాయిలో సానుకూలత ఫలితాలు కనిపిస్తున్నాయి.
రెండో స్థానంలో ఉండి నియోజకవర్గం
ఏలూరు, పశ్చిమలో పోటాపోటీగా సభ్యత్వం
చాలా నియోజకవర్గాల్లో అనూహ్యంగా పెరిగిన శాతం
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఉత్తేజం ఏమాత్రం తగ్గకుండా సభ్యత్వ నమోదులో తీసుకున్న చర్యలతో క్షేత్రస్థాయిలో సానుకూలత ఫలితాలు కనిపిస్తున్నాయి. గతం కంటే భిన్నంగా ఈసారి నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదులో నాయకత్వం ఉత్సాహంగా ముందుకెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే తొలి స్థానంలో నిలవడం ద్వారా సత్తా చాటుకున్నారు. ఉండి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉంది. జిల్లాలో కూడా అదే ఊపులో ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు వెనుకబడగా, అత్యధిక నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో విజయవంతమయ్యారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
గడిచిన ఐదేళ్లపాటు రాజకీయ ఒత్తిళ్లకు భయ పడకుండా పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా నడిచిన తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ అదే ఊపులో ముం దుకు వెళుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని కోరిందే తడవుగా క్షేత్ర స్థాయిలో నేతలు, కార్యకర్తలు దృష్టి పెట్టారు. సభ్యత్వంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు మహి ళలు, కార్మికులు, రైతులు, యువత అన్ని వర్గాల ను పార్టీ సభ్యత్వం తీసుకునేవిధంగా ప్రోత్సహిం చారు. తొలుత సభ్యత్వ నమోదు కొంత గందర గోళంగా ఉన్నా తరువాత పుంజుకుంది. క్లస్టర్ స్థాయిలో నేతలు జనం వద్దకు కదిలారు. ప్రత్యే కించి గోదావరి జిల్లాల్లో టీడీపీకి పూర్తి పట్టుం దన్న వాస్తవాన్ని రుజువు చేసుకునేలా సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు పాలకొల్లు నియోజకవర్గంలో అత్యధికంగా సభ్య త్వ నమోదు కాగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. నియోజకవర్గాల వారీ ఓటర్ల సంఖ్యలో ఎవరెవరు ఎంత శాతం మేర సభ్యత్వ నమోదు చేస్తున్నారనే అంశాన్ని శాతం రూపంలో గుర్తించి ఆ మేరకు ఆయా నియోజకవర్గాల రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో స్థానాలను టీడీపీ అధినాయ కత్వం గుర్తిస్తోంది.
ముందున్న మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో తొలి వరుసలో నిలవడంతో నియోజక వర్గ నేతల ఆనందానికి హద్దు లేదు. నియోజక వర్గంలో పార్టీ సభ్యత్వం 98,195కు చేరగా, లక్షకు పైగా అధిగమించాలని నేతలందరూ పట్టుదలతో ఉన్నారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఎదుట గర్వంగా తలెత్తుకునేలా చేయ డానికి మీ అందరి కృషే కారణమంటూ కార్యక ర్తలు, నేతలను మంత్రి రామానాయుడు సైతం అభినందనలతో ముంచెత్తుతున్నారు.
రెండో స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్
ఉప సభాపతి కె.రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గం సభ్యత్వ నమోదులో రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి నుంచి రఘు రామకృష్ణంరాజు ఒక ప్రణాళిక ప్రకారం పట్టుదల తో సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. నియోజకవర్గంలో 72 వేలకుపైగా సభ్యత్వ నమోదు జరిగింది. ఈ సంఖ్య మరింత పెరగబోతుంది. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ సభ్యత్వ నమోదులో తొలి స్థానంలో ఉంది. ఇప్పటికే 53 వేల మందికిపైగా టీడీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు ఆది నుంచి కేడర్‌ను అప్రమత్తం చేయడం, ఏ రోజుకారోజు పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది. ప్రత్యేకించి ఉంగుటూరు నుంచి జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇక్కడ టీడీపీ తన పట్టు పటిష్టంగానే ఉందనేలా సభ్యత్వ నమోదులో నేరుగా రుజువు చేశారు.
జిల్లాలో మూడో స్థానంలో ఆచంట
పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహి స్తున్న ఆచంట నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలో మూడో స్థానంలో నిలవగా ఇక్కడ 32 వేల మందికిపైగా సభ్యత్వం తీసుకున్నారు. ఎమ్మె ల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న తణుకు జిల్లాలో నాలుగో స్థానం నిలబెట్టుకోగా ఇక్కడ 48 వేల మందికిపైగా టీడీపీ సభ్యత్వం పొందారు. నరసా పురం నియోజకవర్గంకు ఐదో స్థానం దక్కగా ఇక్కడ 25 వేలకుపైగా సభ్యత్వ నమోదు జరిగింది. ఏలూరు జిల్లాలో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలు 6, 7 స్థానాల్లో ఉండగా, పశ్చిమ లో తాడేపల్లిగూడెం, భీమవరం ఇవే స్థానాలో ఉన్నాయి. సభ్యత్వ నమోదుకు ఇంకా గడువు మిగిలి ఉండడంతో సాధ్యమైనంత మేర వేగంగా దూసుకుపోయేందుకే ప్రయత్నిస్తు న్నారు. సభ్యత్వ నమోదు జరిగిన తీరుపై అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు యువనేత లోకేశ్ కూడా సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
నియోజకవర్గాల మధ్య పోటీ
సభ్యత్వ నమోదులో నియోజకవర్గాల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే జిల్లా, రాష్ట్రంలో ఏమాత్రం వెనుకబడరాదని ముఖ్యమంత్రి చంద్ర బాబు, యువనేత లోకేశ్ దృష్టిలో తాము కచ్చి తంగా నిలబడాల్సిందేననే ధోరణిలో సభ్యత్వ నమోదులో జాగ్రత్తలు తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరు నియోజకవర్గం 49,854 సభ్యత్వ నమోదుతో రెండో స్థానంలో నిలిచింది. ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా సభ్యత్వ నమోదు జరిగేలా జాగ్రత్త లు తీసుకున్నారు. కైకలూరు నియోజకవర్గంలో స్థానిక నేతలంతా ఉమ్మడిగా కష్టపడి సభ్యత్వ నమోదును 39 వేలకుపైగా తీసుకువెళ్లగలిగారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమ నేని ప్రభాకర్ 40 వేల సభ్యత్వ నమోదుతో జిల్లాలో నాలుగో స్థానంలో ఉన్నారు.
మంత్రి పార్థసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గం జిల్లాలో ఐదవ స్థానం లో నిలవగా అక్కడ 44,500 మందికి సభ్యత్వం ఇచ్చారు. మొత్తం ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని జరిగిన సభ్యత్వ నమోదును శాతం రూపంలో విశ్లేషించడంతో కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వం ఎక్కువ జరిగినా జిల్లా స్థాయి స్థానాల్లో మాత్రం మార్పు కనిపించింది.