పట్టిసీమకు జలకళ
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:21 AM
ఐదేళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ కళకళలాడనుంది.
నేడు నీటిని విడుదల చేయనున్న మంత్రి నిమ్మల
పోలవరం, జూలై 2 : ఐదేళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ కళకళలాడనుంది. గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా పడకేసి రైతులకు సాగు నీటి కష్టాలను మిగిల్చి ఇప్పుడు జలకళను సంతరించుకోనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం ఉదయం 7.27 గంటలకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. దీనిపై ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి డెల్టాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులు సాగు నీటి కోసం ఇబ్బందులు పడకూడదనే దృక్పథంతో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు రూ.1,600 కోట్లతో ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని నుంచి 1800 క్యూసెక్కుల జలాలు పంపిణీ జరిగేది. ఏటా నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేసేవారు. టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఆరంభం నుంచి 2019 రబీ సీజన్ వరకూ 305.07 టీఎంసీల నీటిని కృష్ణా, రాయలసీమ, ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వ పాలనలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్ళు పడకేయించి రైతుల ఉసురు పోసుకుంది. 2020లో 4.5424 టీఎంసీలు, 2021లో 1.6417 టీఎంసీలు పంపిణీ చేసింది. నాలుగేళ్లలో 58.7421 టీఎంసీలు మాత్రమే ఇచ్చింది. దీనివల్ల రైతులకు సాగు నీరందక, పంటలు నష్టపోయి విరామం పాటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది పంటలకు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు పట్టిసీమ నేటి నుంచి జీవధార కానుందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.