మాజీ ఎమ్మెల్యే గ్రంధిపై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:39 PM
మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు.
భీమవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు. భీమవరంలో జగనన్న కాలనీల పేరుతో నిర్వహించిన భూసేకరణలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు సారాంశం. భీమవరంలో పేదల ఇళ్ల కోసం దాదాపు 140 ఎకరాలు సేకరించారు. బహిరంగ మార్కెట్ కంటే అధిక ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చర్యలు తీసుకుని భారీగా లబ్ధిపొందారంటూ పవన్ కల్యాణ్‌కు భీమవరం నుంచి ఫిర్యాదు వెళ్లింది. గతంలోనే భూసేకరణపై అనేక విమర్శలున్నాయి. తాజాగా అందిన ఫిర్యాదుపై పవన్ కల్యాణ్ స్పందించారు. అదే విషయంపై జిల్లా కలెక్టర్ నాగరాణికి తెలిపారు. భూసేకరణలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని సూచించారు. లిఖిత పూర్వకంగానూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. భీమవ రంలో ఈ విషయం రాజకీయంగా వేడెక్కించింది. ఇటీవల వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గ్రంధి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు బుజ్జగింపులు చేసిన ఫలించలేదు. మరోవైపు గ్రంధి తన రాజకీయ వ్యూహాన్ని మారుస్తారంటూ ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ ఫిర్యాదు రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకున్నది.