Share News

కేసులు రివర్స్‌

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:11 AM

ఓ న్యాయవాది తన కారును రూ.7 లక్షలకు విక్రయిస్తానని ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పెట్టాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తాను కొనుగోలు చేస్తానని అడ్వాన్స్‌ రూ.3 లక్షలు చెల్లించారు.

కేసులు రివర్స్‌
కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ నాగరాజు

నిందితులకు వత్తాసు.. బాధితులపైనే కేసులు

సివిల్‌ తగాదాలు.. సెటిల్‌మెంట్‌లు.. ఆ సీఐ స్పెషాలిటీ

జిల్లా వాణిజ్య కేంద్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలు

వైసీపీ దందా.. కూటమిలో కొనసాగింపు

అర్ధరాత్రి రోడ్లపై అల్లరి గ్యాంగ్‌ల హంగామా

పట్టణ ప్రజలు, మహిళల ఆందోళన

(భీమవరం– ఆంధ్రజ్యోతి): ఓ న్యాయవాది తన కారును రూ.7 లక్షలకు విక్రయిస్తానని ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పెట్టాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తాను కొనుగోలు చేస్తానని అడ్వాన్స్‌ రూ.3 లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము చెల్లించి కారు తీసుకువెళదామని వస్తే అప్పటికే న్యాయవాది దానిని వేరే వారికి విక్రయించాడు. బాధితులు ఆ సీఐని సంప్రదించారు. న్యాయవాదిని పోలీస్‌స్టేషన్‌కు అతనికి మద్దతుగా మాట్లాడాడు. మూడు కాదు.. లక్షన్నరే తీసుకోవాలని సూచించారు. లేదంటే కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. బాధితులు తమ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దృష్టికి సమస్యను వివరించారు. దీంతో ఈ టీడీపీ నేత మూడు లక్షలు ఇప్పించి, సమస్యను పరిష్కరించారు.

ఆ ఊరిలో ఆయనో పెద్ద మనిషి. ఇటీవల ఒకరి వద్ద స్థలాన్ని కొన్నారు. దీని స్వాధీ నానికి ప్రయత్నిస్తే స్థల యజమాని బంధువులు అడ్డు తగిలారు. విషయాన్ని తెలంగాణలోని ఓ ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన నుంచి ఇక్కడ సీఐకు ఫోన్‌ వచ్చింది. స్థలాన్ని కొన్న పెద్ద మనిషిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. దానిని ఎందుకు కొన్నారంటూ నిలదీ శారు. అదేస్థాయిలో సమాధానమిచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఆ పెద్దాయన సీఐపై న్యాయస్థానంలో కేసు వేశారు.

ఓ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్‌ను కొందరు వ్యక్తులు సొమ్ముల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఇవ్వకపోవడంతో ఆ డాక్టర్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై డాక్టర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో సదరు పోలీస్‌ అధికారి స్పందించకపోగా తిరిగి ఆ డాక్టర్‌ బంధువులపై కేసు పెట్టారు. డాక్టర్‌ ఫిర్యాదు ఎందుకు స్వీకరించలేదని స్థానిక ఎమ్మెల్యే ఆ సీఐని ప్రశ్నించారు. అయినా ఆ అధికారిలో మార్పు లేదు.

ఇలా ఒకటా, రెండా.. చెప్పుకుంటూపోతే పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య కేంద్రమైన ఆ పట్టణంలో ఈ సీఐ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి వంత పాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతా వైసీపీ నేతకు పోలీసులు సెల్యూట్‌ చేసేలా ఏర్పాటు చేశారు. దీనిపై కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పట్టణంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. రాత్రి వేళల్లో అల్లరి మూకలు తిరుగుతున్నాయి. గతంలో రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ నిర్వహించేవారు. ఆ సమయంలో అల్లరి మూకలను చెల్లా చెదురుచేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల సదరు పట్టణంలో హత్యలు జరిగాయి. కేసుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని ప్రాంతాలు రౌడీలకు నిలయంగా మారింది. రాత్రి అయితే చాలు చిల్లర రౌడీలు చెలరేగిపోతున్నారు. తమ భద్రత లేకుండా పోతోందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ‘గతంలో మా ప్రాంతానికి పోలీస్‌ వాహనాలు వచ్చేవి. మూకలు గుమిగూడే ప్రాంతాలను గుర్తించి గస్తీ తిరిగేవారు. సైరన్‌ మోగితే చాలు అల్లరి మూకలు పరుగులు తీసేవి. బయటకు రావడానికి భయపడేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి’ అన్న ఆందోళన ఈ పట్టణంలోని అన్నివర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. వ్యాపారుల నుంచి ప్రైవేటు వసూళ్లు అధికమయ్యాయి. స్టేషన్‌కు వెళితే న్యాయం జరుగుతుందన్న భరోసా లేకపోయింది. వైసీపీ ప్రభుత్వంలో నేత మాత్రమే వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ముఖ్యుల నుంచి ఇబ్బంది లేదు. ఇతరుల నుంచి వసూళ్ల పర్వం మొదలైదంటూ వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా ఇవే చర్చలు నడుస్తున్నాయి.

రాత్రిళ్లు.. రోడ్లపై చక్కర్లు

యువతకు తాడేపల్లిగూడెం సీఐ సుబ్రహ్మణ్యం కౌన్సెలింగ్‌

తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం రాత్రి 10 గంటల దాటిన తర్వాత రోడ్లపై వేగంగా బైక్‌లపై తిరుగుతున్న యు వకులను గుర్తించి వారికి సీఐ సుబ్ర హ్మణ్యం కౌన్సె లింగ్‌ ఇచ్చారు. రాత్రి వేళల్లో పట్ట ణంలో అనవస రంగా బైక్‌లపై చక్కర్లు కొట్టడం నేరమన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:16 AM