Share News

ఆరు నెలలకే..

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:51 PM

రహదారి వేసిన తొలి రోజుల్లో ప్రయాణికులు ఆనందపడ్డారు. నరకయాతన నుంచి బయటపడ్డామని ఆశించారు. తీరా బస్సు ప్రయాణంలో బెంబేలెత్తిపోతున్నారు.

ఆరు నెలలకే..

భీమవరం–తాడేపల్లిగూడెం ప్రయాణం నరకప్రాయం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రహదారి వేసిన తొలి రోజుల్లో ప్రయాణికులు ఆనందపడ్డారు. నరకయాతన నుంచి బయటపడ్డామని ఆశించారు. తీరా బస్సు ప్రయాణంలో బెంబేలెత్తిపోతున్నారు. యండగండి నుంచి పిప్పర మధ్యలో బస్సులు ఊగిపోతున్నాయి. వాహనదారులు రాకపోకలకు యాతన పడుతున్నారు. దుమ్ము రేగిపోతోంది. రహదారి మొత్తం బీటలు వారింది. చిప్స్‌ నలిగిపోయి దుమ్ము రేగుతోంది. భీమవరం–తాడేపల్లిగూడెం రహదారి ఇక బాగు పడదంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ హయాంలో దీనిపై సెటైర్‌లు వేశారు. అప్పటి ప్రజాప్రతినిధులు నాటి ఆర్‌అండ్‌బీ మంత్రిని జిల్లా అభివృద్ధి సమీక్షలో నిలదీసే ప్రయత్నం చేశారు. భీమవరం–తాడేపల్లిగూడెం మధ్య ప్రయాణం చేస్తే జిల్లాలో రహదారులు పరిస్థితి తెలుస్తుందంటూ అప్పటి ప్రజాప్రతినిధులు ఎద్దేవా చేశారు. తీరా ఎన్నికల ముందు నిధులు కేటాయించి పనులు చేపట్టారు. అంతలోనే రహదారి మళ్లీ గోతుల మయమైంది. సుమారు 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు.

జాతీయ రహదారి అంటూ హడావుడి

వైసీపీ హయాంలో భీమవరం–తాడేపల్లిగూడెం రహదారికి జాతీయ హోదా లభించిందంటూ ఆ నేతలు పెద్ద హడావుడే చేశారు. దీనివల్ల కేంద్రమే నిధులు కేటాయించి నిర్మాణం చేపడుతుందంటూ జనం ఆశించారు. తీరా అదంతా ఒట్టిదే అని తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు జాతీయ హోదా వంటిదేమీలేదని తేల్చేశారు. నిజానికి భీమవరం–తాడేపల్లిగూడెం మధ్య రహదారిని పక్కాగా నిర్మించాలంటూ జనం ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. రహదారికి ఆనుకుని కాలువ ఉండడం వల్ల కోట్లు వెచ్చించి రహదారి నిర్మిస్తున్నా సరే దెబ్బ తింటోందని అధికారులు చెబుతున్నారు. కానీ శాశ్వత పరిష్కారం కనుగొనకలేకపోతున్నారు. మరోవైపు ఆరు నెలలు తిరగకుండానే రహదారి దెబ్బ తినడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతా గోతులుగా మారింది. లేనిచోట రహదారికి బీటలు వారాయి.

చిప్స్‌తోనే సరా..

గోతుల్లో ఇప్పుడు కాంట్రాక్టర్‌ చిప్స్‌ వేస్తున్నారు. అంతటితో సరిపెట్టే ప్రయత్నం చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. మళ్లీ రహదారి వేస్తే తప్పా ప్రయాణికులకు ప్రయోజనం ఉండదు. గోతులు పడ్డ చోట చిప్స్‌ వేస్తున్నారు. దానివల్ల మరింత దుమ్ము రేగుతోంది. అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. కొద్ది రోజుల వ్యవధిలోనే రహదారి ఎందుకు దెబ్బతిందో ఆలోచించాలి. అలా కాకుండా కాలువ పేరుతో కారణాలు చూపితే ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టే. ప్రయాణికులు ఎప్పటిలాగే ఇబ్బందులు పడతారు.

కేంద్రం నుంచి రూ.25 కోట్లు మంజూరు

యండగండి నుంచి పిప్పర దాకా రహదారిని విస్తరించి నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 25 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారుల మధ్య ఉండే రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. భీమవరం నుంచి లోసరి వరకు, అలాగే పిప్పర దాకా రహదారి అభివృద్ధి కోసం రూ. 99 కోట్లు కేటాయించింది. అందులోనే యండగండి నుంచి పిప్పర వరకు రూ. 25 కోట్లు ప్యాకేజీ ఉంది. వైసీపీ హయాంలో నిర్మాణాలు చేపట్టినట్టే రహదారిని ఏర్పాటు చేస్తే నిధులు వృథాకానున్నాయి. ఎప్పటిలాగే రహదారి దెబ్బతింటుంది. కోట్లు రూపాయలకు గండి పడనుంది. దీర్ఘకాలం మన్నిక ఉండేలా రహదారి వేయాలి. అలా కాకుండా నిర్మాణం చేపట్టినా ప్రయోజనం లేదు. పిప్పర నుంచి తాడేపల్లిగూడెం వరకు కాలువకు రివిట్‌మెంట్‌ ఏర్పాటు చేయడంతో రహదారి మన్నికగా ఉంటోంది. లేదా ఇతర రాష్ర్టాల్లో సిమెంట్‌ రహదారికి వేసినట్టు అడుగుభాగంలో కాంక్రీట్‌ మాదిరిగా నిర్మాణం చేపడుతున్నారు. ఆ పైన బిటిరోడ్డు వేస్తున్నారు. దీనివల్ల మన్నిక ఎక్కువగా ఉంటోంది. మొత్తంపైన ఆరు నెల ల వరకు కూడా రహదారి మన్నిక లేకపోవడంతో అంతా తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం తాజాగా కేటాయించిన నిధులపైనా చర్చ సాగుతోంది.

Updated Date - Nov 05 , 2024 | 11:51 PM