గల్ఫ్‌లో ఉద్యోగాలంటూ రూ.40 లక్షల వసూళ్లు
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:48 AM
మళ్లీ జిల్లాలో గల్ఫ్ మోసాలు పెరుగుతున్నాయి. కొంతకాలంగా ఒక్కొక్క కేసు వెలుగు చూస్తు న్నాయి.
నరసాపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మళ్లీ జిల్లాలో గల్ఫ్ మోసాలు పెరుగుతున్నాయి. కొంతకాలంగా ఒక్కొక్క కేసు వెలుగు చూస్తు న్నాయి. కొందరు పోలీసులను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు పెద్దల సమక్షంలో రాజీ చేసుకుని ఇచ్చిన సొమ్ముతో సరిపుచ్చుకుంటున్నారు. తాజా గా జిల్లాలో మరో మోసం వెలుగు చూసింది. కాకినాడ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని 29 మంది నుంచి రూ.40 లక్షలు వసూలు చేశారు. ఏడాదిన్నరగా వీరిని విమానం ఎక్కించలేదు. ముంబయి, చెన్నైలకు తీసుకెళ్లి మెడికల్ టెస్ట్‌లు చేయించా డు. ముందస్తు ప్లాన్‌తో మెడికల్ రిపోర్ట్‌లో లోపాలున్నాయని భయపెట్టి తప్పించుకుంటూ వచ్చాడు. నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాలకు చెందిన బాధితులు మోసపోయారు. వీరంతా నేరుగా ఏజెంట్‌కు సొమ్ములు ఇవ్వలేదు. నరసాపురం, ఇతర ప్రాంతాలకు చెందిన సబ్ ఏజెంట్లకు సొమ్ములు చెల్లించారు. అయితే బాధితులెవరికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. బాధితు లంతా సబ్ ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురావడంతో కాకినాడలో ఉన్న మెయిన్ ఏజెంట్ మంగళ వారం నరసాపురం వచ్చారు. ముందుగా ఓ పెద్ద మనిషి సమక్షంలో చర్చలు జరిగాయి. చివరికి వచ్చే నెల 10న సొమ్ములు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ప్రధాన ఏజెంట్‌ను వదిలి పెట్టారు. దీనిపై బాఽధితుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్ సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు