సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్స్
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:18 AM
సంక్రాంతి సీజన్ ద్వారా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
హైదరాబాద్ నుంచి జిల్లాకు 113 సర్వీసులు
జనవరి 9నుంచి 13వరకు 4 డిపోల నుంచి బస్సులు
జనవరి 15 నుంచి 20 వరకు హైదరాబాద్‌కు 79 ప్రత్యేక సర్వీసులు
భీమవరం టౌన్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సీజన్ ద్వారా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే అన్ని రెగ్యులర్ సర్వీసులకు టికెట్లు బుక్ అవ్వటంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సర్వీసులను నడిపేలా కార్యాచరణ సిద్ధం చేశారు. చార్జీల పెంపులేకుండా రెగ్యులర్ చార్జీలతో సర్వీసులను నడుపుతున్నారు. సంక్రాంతికి సంబంధించి వచ్చేనెల 9 వ తేదీ నుంచి 13 వరకు 113 సర్వీసులు నడపాలని నిర్ణయించారు. డిపోల వారీగా లక్ష్యాలను నిర్ధారించి సంబంధిత డిపో మేనేజర్లకు సమాచారం అందించారు. 10వ తేదీన ముక్కోటి, 11న రెండో శనివారం, 12 ఆదివారం 13వ తేదీ సోమవారం భోగి 14న మంగళవారం సంక్రాంతి, 15న బుధవారం కనుమ రావటంతో వరసగా సెలవులు వచ్చిన నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు.
జనవరి 15 నుంచి 20 వరకు హైదరాబాద్‌కు..
సంక్రాంతి పండుగ తరువాత జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. రెగ్యులర్ సర్వీసులతో పాటు 79 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించారు. డిపోల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. అవసరమైతే మరిన్ని సర్వీసులు నడిపేలా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రత్యేక సర్వీసులను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఒక బస్సు రిజర్వేషన్ పూర్తయిన వెంటనే మరో సర్వీసును ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
విశాఖపట్నం సర్వీసులపై దృష్టి
ప్రజారవాణాధికారి ప్రసాద్
హైదరాబాద్‌తోపాటు సంక్రాంతి రద్దీ విశాఖపట్నం వైపు కూడా స్పందనపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు జిల్లా ప్రజారావాణాధికారి ప్రసాద్ తెలిపారు. అవసరమైతే విశాఖపట్నంకు ప్రత్యేక సర్వీసులను నడుపుతామని ఆయన తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎంలను ఆదేశించామన్నారు. సంక్రాంతి సీజన్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ఆలోచన చేస్తున్నామన్నారు.