Share News

ఎస్సీ డ్వాక్రా మహిళలకు రుణాలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:19 AM

డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి వ్యాపార సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రధానమంత్రి అనుసుచిత్‌ జాతి అభ్యుదయ్‌ యోజన(పీఎం అజయ్‌) కింద రూ.50 వేలు సబ్సిడీతో రుణాలు మంజూరుచేస్తారు.

ఎస్సీ డ్వాక్రా మహిళలకు రుణాలు

లక్ష నుంచి మూడు లక్షల వరకు పరిమితి.. రూ.50 వేలు సబ్సిడీ

ఈ సొమ్ముతో నాలుగు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు

పీఎం అజయ్‌ కింద జిల్లాకు

62 యూనిట్‌లు మంజూరు

భీమవరం రూరల్‌, నవంబరు 16(ఆం ధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి వ్యాపార సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రధానమంత్రి అనుసుచిత్‌ జాతి అభ్యుదయ్‌ యోజన(పీఎం అజయ్‌) కింద రూ.50 వేలు సబ్సిడీతో రుణాలు మంజూరుచేస్తారు. ఏపీ ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ డ్వాక్రా మహిళలు రుణాలు పొందేలా అవకాశం కల్పించారు. గతంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో రాయి తీని జత కలిపారు. రాయితీని మినహా యించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు వడ్డీ లేకుండా చెల్లించుకునే వెసులుబా టు ఇచ్చారు. జిల్లాలో 62 యూనిట్‌లకు సబ్సిడీ రుణాలు ఇచ్చేలా నిర్ణయించారు. వ్యాపారం చేసుకోవాలనుకునే ఎస్సీ మహిళలు వీటికి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 3,187 డ్వాక్రా సంఘాలకు గాను మూడు లక్షల 20 వేల సభ్యులు ఉన్నా రు. వీరిలో 60 వేల మంది ఎస్సీ మహిళలు. వీరిలో మండలాల వారీగా నిర్ణయించిన యూనిట్ల ప్రకారం రుణాలు పొందవచ్చు.

రుణాలు ఎలా పొందాలి ?

ఎస్సీ కుటుంబానికి చెందిన వారే అర్హులు. 60 ఏళ్లలోపు వయసు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులై ఉండాలి. ప్రతి యూ నిట్‌కు లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో రూ.50 వేలు సబ్సిడీ వుంటుంది. లబ్ధిదారులు తొలుత పది శాతం మొత్తాన్ని సీఈవో సెర్ప్‌ ఉన్నతి వారి రికవరీ ఖాతాకు జమ చేయాలి. నాలుగు రకాల వ్యాపారాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తారు. మొదటిది వ్యవసాయ రంగం. ఇందులో కూరగాయలు, నర్సరీ వంటి పలు విధాలుగా వ్యాపారాలు పెట్టుకోవాలి. రెండోది సేవా రంగం. ఇందులో ఆటో రిక్షా, ఫొటో స్టూడియో, ట్రావెల్‌ ఏజెన్సీ, జిరాక్స్‌ సెంటర్‌ పెట్టుకోవచ్చు. మూడవదిగా సూక్ష్మ వ్యాపారం. కిరాణా, పూలు విక్రయాలు చేయవచ్చు. నాలుగోది చిన్నతరహాకు చెందిన పరిశ్రమలు.. కొబ్బరి పీచు ఉత్పత్తులు, వాటర్‌ ప్లాంట్‌, కుండల తయారీ వ్యాపారాలతో సబ్సిడీ రుణాలు పొందవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా గ్రూపుల్లో డిఫాల్ట్‌ కాని మహిళ లకు ప్రాధాన్యం ఇస్తారు.

Updated Date - Nov 17 , 2024 | 12:19 AM