చదువులు సాఫీగా..
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:40 AM
ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంతో (పీఎం ఎస్‌ఆర్‌ఐ) ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధుల వరద పారనుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు చేసే అభివృద్ధితోపాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఎంచుకుని పీఎం ఎస్‌ఆర్‌ఐ పథకం ద్వారా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
పాఠశాలల అభివృద్ధికి పీఎం ఎస్‌ఆర్‌ఐ పథకంలో జిల్లాకు ఐదు కోట్లు కేటాయింపు
తొలివిడత 22 పాఠశాలలకు ఐదు కోట్ల రూపాయల కేటాయింపు
ల్యాబ్స్, లైబ్రరీ గదులు తదితర పనులు చేసేలా ప్రణాళిక.. రెండో విడతలో మరిన్ని
భీమవరం రూరల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంతో (పీఎం ఎస్‌ఆర్‌ఐ) ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధుల వరద పారనుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు చేసే అభివృద్ధితోపాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఎంచుకుని పీఎం ఎస్‌ఆర్‌ఐ పథకం ద్వారా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మండలానికి ఒకటి చొప్పున జిల్లాలో మొదట విడతగా 22 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. రూ.5 కోట్లను కేటాయించి వీటిని అభివృద్ధి చేయనున్నారు. విద్యా బోధనలో భాగంగా అన్ని సౌకర్యాలు అందించే దిశగా ఈ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం ఇప్పటికే అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసింది. జిల్లాలో 1375 ప్రభుత్వ పాఠశాలల్లో 99 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఉన్నత విద్యను అందించడంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. పీఎం ఎస్‌ఆర్‌ఐ పథకం ద్వారా అవసరం ఉన్నచోట తాగునీటి ఆర్‌వో ప్లాంట్‌లు, లైబ్రరీ రూమ్‌లు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లు, కిచెన్ గార్డెన్ ఫినిషింగ్‌లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సోలార్ ప్యానల్స్ వంటి అభివృద్ధి పనులు చేయనున్నారు. సైకిల్ ర్యాంప్‌లతోపాటు క్రీడా మైదానంలో ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి క్రీడల కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ల్యాబ్‌లో ఎక్విప్‌మెంట్స్‌ను ఏర్పాటు చేస్తారు. మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాక 2వ విడత మరికొన్నింటిని ఎంపిక చేసి అభివృద్ది చేయనున్నారు. ఈ పథకం ద్వారా కేటాయించిన నిధులతో పనులు చేయనున్నట్లు సమగ్ర శిక్ష డీఈ శక్తీశ్వరరావు తెలిపారు.
ఎంపికైన పాఠశాలలు
తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూలు, తణుకు జడ్పీ హైస్కూ లు, ఇరగవరం జడ్పీ హైస్కూలు, చినకాపవరం జడ్పీ హైస్కూలు, ఆకివీడు జడ్పీ హైస్కూలు, కలవపూడి జడ్పీ హైస్కూలు, పెనుమంట్ర జడ్పీ హైస్కూలు, ఆచంట వేమవరం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ స్కూల్, ఎల్‌బీ చర్ల ఉన్నత పాఠశాల, పెంటపాడు జీహెచ్‌ఎస్ పాఠశాల, యండగండి పీహెచ్‌ఎస్ పాఠశాల, గూట్లపాడు జడ్పీ హైస్కూలు, భీమవరం జేఎల్‌బీ గరల్స్ ఉన్నత పాఠశాల, మోగల్లు జడ్పీ హైస్కూలు, కవిటం జడ్పీ హైస్కూలు, పాలకొల్లు బిఆర్‌ఎంవి మునిసిపల్ ఉన్నత పాఠశాల, కరగట్ల ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్, బల్లిపాడు జడ్పీ హైస్కూలు, వీరవాసం జడ్పీ హైస్కూలు, వేమవరం జడ్పీ హైస్కూలు, శివదేవుని చిక్కాల జడ్పీ హైస్కూలు, మోగల్తూరు జడ్పీ హైస్కూలు ఉన్నాయి.
ప్లస్ వన్‌పై ఫోకస్
ప్రత్యేక దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం
ఇప్పటికే క్వాలిఫై లెక్చరర్ల ఏర్పాటుకు నిర్ణయం
ఒకటి నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు
ల్యాబ్‌లు, అదనపు గ్రూపులపైనా దృష్టి పెట్టాలి
భీమవరం రూరల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చి, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ప్లస్ టూ జూనియర్ కళాశాలల అభివృద్ధికి, వాటిలో సౌకర్యాలు పెంచాలి. గత ఏడాది వరకు ప్లస్ వన్ మహిళా జూనియర్‌కళాశాలలుగానే కొనసాగాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అదనంగా కో–ఎడ్యుకేషన్ ప్లస్ వన్ జూనియర్ కళాశాలలుగా మరికొన్ని కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థుల సంఖ్య కొంత పెరిగినప్పటికీ కళాశాలల్లో విద్యకు సంబంధించి సౌకర్యాలు మరికొన్ని అందుబాటులోకి తీసుకువస్తేనే అవి రానున్న రోజుల్లో విద్యార్థులకు ఆకర్షణగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 25 ప్లస్ వన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వీటిలో 16 ప్లస్ వన్ మహిళా జూనియర్ కళాశాలలుగా, 9 కో–ఎడ్యుకేషన్ కళాశాలలుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కింద 470 మంది విద్యార్థులు చదువుతున్నారు.
సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్లస్ వన్ మహిళా జూనియర్ కళాశాలలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చినా విద్యార్థులకు కావలసిన ప్రొఫెసర్లు గాని, ఎక్విప్‌మెంట్స్, ల్యాబ్‌లు ఏవీ ఏర్పాటు చేయలేదు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులతోనే విద్యాబోధన చేయించడంతో ఉత్తీర్ణత శాతం 20 శాతం లోపుగా నిలిచింది. దీంతో మరుసటి సంవత్సరం విద్యార్థుల చేరిక సంఖ్య పెద్దగా లేకపోయింది. ఎంపీసీ, సీఈసీ గ్రూపుల వరకే పరిమితం చేయడంతో ఇతర గ్రూపుల్లో చేరాలనుకున్న విద్యార్థులు ఈ కళాశాలల వైపు చూడకుండా ప్రైవేట్‌బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాల నుంచి పదో తరగతి పూర్తి చేసుకుని బయటకు వచ్చినా ఈ కళాశాలల్లో బాలురకు చేరే అవకాశం లేనందున వారు ప్రైవేట్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. ఇన్ని విధాలుగా ప్లస్ వన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులకు ఆకర్షణగా గత వైసీపీ ప్రభుత్వంలో నిలువలేకపోయాయి. కళాశాలలు పదిలోపు విద్యార్థులతోనే సాగాయి.
కూటమి ప్రభుత్వం రాకతో..
ప్లస్ వన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టి పెట్టింది. కో– ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలను ఉచితంగా అందించింది. దాతల సహకారంతో విద్యార్థులకు యూనిఫామ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి రానుంది. పాఠశాలల్లో ఎంపీసీ, సీఈసీ గ్రూపులు మాత్రమే నిర్వహిస్తున్నాయి. బైపీసీ, ఒకేషనల్ వంటి గ్రూపులు ఈ కళాశాలల్లో అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. ఫ్యాకల్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాబ్‌లను, కంప్యూటర్ సౌకర్యాన్ని తీసుకురావాలి. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోగా అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అతి చేరువలోనే ఇంటర్ ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులకు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ ఇంటర్ విద్యా సంస్థల్లో రెండేళ్లు చదువుకోవాలంటే లక్షకు పైగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న ఈ ప్లస్ వన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పల్లెల్లో విద్యార్థులకు ఉపయోగకరంగానే ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
ప్రతిభ కనబరుస్తున్నారు
దిరుసుమర్రు ప్లస్ వన్ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరుస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 85 శాతం ఉత్తీర్ణత సాధించారు. వారికి ఉత్తీర్ణత పెంచే దిశగా స్పెషల్ మెటీరియల్ ఇస్తున్నాం. బోధనలో ప్రణాళికగా ముందుకు సాగుతున్నాం. ఉపా ధ్యాయులందరూ కలిసి యూనిఫామ్ ఏర్పాటుచేశాం. ఈ ఏడాది టెక్ట్స్, నోట్ బుక్‌లు ప్రభుత్వం అందించడం విద్యార్థులకు సహకారంగా నిలిచింది.
– ఉదయ భాస్కరరావు, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, దిరుసుమర్రు ప్లస్ వన్ జూనియర్ కళాశాల ఇన్‌ఛార్జి