స్కూళ్లకు నిధులు ఫుల్
ABN , Publish Date - Nov 03 , 2024 | 11:49 PM
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయమని, విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ సూచించిన కూటమి ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు కావల్సిన నిధులును విడుదల చేసి చిత్తశుద్ధిని చాటింది.
ప్రభుత్వ పాఠశాలలకు కాంపోజిట్ గ్రాంట్ల విడుదల
ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ప్రాధాన్యం
సుద్దముక్కకు సొమ్ముల్లేని స్థితి నుంచి అన్ని వసతులకు అవకాశం
నిడమర్రు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయమని, విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ సూచించిన కూటమి ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు కావల్సిన నిధులును విడుదల చేసి చిత్తశుద్ధిని చాటింది. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి కావల్సిన సుద్దముక్కలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఉపాధ్యాయులు జేబుల్లోంచి ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నుంచి ప్రస్తుతం నూతన ప్రభుత్వం దూరం చేసింది. పాఠశాలల నిర్వహణకు కావల్సిన వస్తు సామగ్రి, కరెంట్ బిల్లులు, రిజిష్టర్ల కొనుగోలు మొత్తం ఈ కాంపోజిట్ గ్రాంట్ నుంచి పొందడం ద్వారా ఉపాధ్యాయులకు ఊరట లభించినట్టయింది. మండల వనరుల కేంద్రంలో ఒకప్పుడు జిరాక్స్ కాపీలకు సొమ్ముల్లేక చేతి డబ్బులు ఖర్చు చేసుకున్న ఎంఈవోలు ప్రస్తుతం మండల వనరుల కేంద్రం గ్రాంట్ విడుదలతో ఊరట చెందుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎంల జేబులకు చిల్లు..
గతంలో పాఠశాలల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలకు వారి విద్యార్థుల హాజరు నమోదు ఆధారంగా రూ.5,000 నుంచి రూ.25000 వరకు నిధుల మంజూరు చేసేవారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్, జూలై నెలల్లో ఆయా పాఠశాలల విద్యాకమిటీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. స్కూల్ గ్రాంట్, మెయింట్‌నెన్స్ గ్రాంట్, టీఎఎం గ్రాంట్ రూపాల్లో నిధులు మంజూరయ్యేవి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లుగా పాఠశాల నిర్వహణ ఖర్చులకు సొమ్ములు విడుదల చేయలేదు. గత విద్యా సంవత్సరం పాఠశాల నిర్వహణకు ఒక్క రూపాయి నిధులు విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులే తమ జేబుల్లోంచి సొమ్ములు వెచ్చించాల్సి వచ్చింది. ఈలోపు బదిలీలు జరగడంతో ఖర్చుచేసిన దానికి నిధులు విడుదల కాక బిల్లులు సబ్మిట్ చేసే అవకాశం లేక వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక్కో పాఠశాల హెచ్‌ఎం ప్రాథమిక పాఠశాల అయితే రూ.10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.20 వేలుపైచిలుకు ఇక ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలకు రూ.50 వేల పైచిలుకే చేతి చమురు వదిలించుకున్నారు.
కాంపోజిట్ గ్రాంట్‌తో ఉపయోగాలు
పాఠశాలలకు విడుదల చేయబడిన కాంపోజిట్ గ్రాంట్‌ల ద్వారా పాఠశాలల నిర్వహణ చాలా బాగుంటుందని ఉపాధ్యాయ వర్గాలు వక్కానిస్తున్నాయి. పాఠశాలలకు కావల్సిన సుద్దముక్కలు , రిజిష్టర్లు, పుస్తకాలు, స్టేషనరీ వంటి సామగ్రి కొనుగోలు తోపాటు పాఠశాలలో చేపట్టే జాతీయ పండుగలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. మైనర్ రిపేర్లు తో పాటు మేజర్లు రిపేర్లు, ల్యాబ్ వస్తువుల కొనుగోలు, ఆట వస్తువుల కొనుగోలు, వాటర్ ప్యూరిఫైయర్లు రిపేరు , కంప్యూటర్లు, టి,వి ల రిపేరు వంటి వాటికి ఉపయోగించు కోవచ్చని నిబందనలు చెబుతున్నాయి.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో కాంపోజిట్ గ్రాంట్ మంజూరు చేయబడిన పీఎంశ్రీ స్కూల్ప్, కేజీబీవీ స్కూల్స్, హైస్కూల్ ప్లస్, జూనియర్ కాలేజి, సొసైటీలకు మంజూరైన గ్రాంట్ల వివరాలు..
పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్స్ సంఖ్య.. 1,326
అప్రూవ్ చేయబడిన మొత్తం రూ.3.35 కోట్లు
50 శాతం మంజూరు చేసిన మొత్తం : 1.67 కోట్లు
ఏలూరు జిల్లాలో స్కూల్స్ సంఖ్య 1,578
అప్రూవ్ చేయబడిన మొత్తం – 4.09 కోట్లు
50 శాతం మంజూరు చేసిన మొత్తం : 2.4 కోట్లు
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో మంజూరు కాబడిన మండల వనరుల కేంద్రం నిధుల వివరాలు
పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్‌సీల సంఖ్య 19
మంజూరైన గ్రాంట్ రూ.1,30,000 (ఒక్కొక్కదానికి) చొప్పున మొత్తం సొమ్ము రూ.24.7 లక్షలు
ఏలూరు జిల్లా ఎంఆర్‌సీల సంఖ్య 28
మంజూరైన గ్రాంట్ రూ.1,30,000 (ఒక్కొక్క దానికి) చొప్పున మొత్తం సొమ్ము రూ.36.4 లక్షలు