ఏటిగట్టుపై చెత్త.. దారుణం
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:34 AM
ఏటిగట్టు ప్రాంతంలోని కంపోస్టుయార్డును పరిశీ లించిన ప్రత్యేక బృందం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
ప్రజలు ఎలా నివసిస్తున్నారు?
కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక బృందం దిగ్ర్భాంతి!
కంపోస్ట్‌యార్డుపై నేషనల్ ట్రిబ్యునల్ విచారణ
ప్రత్యేక బృందం ఏర్పాటు
రెండు రోజులపాటు పరిశీలన
నరసాపురంలో గాలి, నీటి నమూనాల సేకరణ
నరసాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏటిగట్టు ప్రాంతంలోని కంపోస్టుయార్డును పరిశీ లించిన ప్రత్యేక బృందం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఏటిగట్టుపై కంపోస్ట్ యార్డు దారుణమని, కాలుష్యంతో వ్యాధి కారకమని, పరిసర ప్రాంతాల ప్రజలు ఎలా నివసిస్తున్నారని ఆశ్చర్యపోయింది. నరసాపురం స్మృతివనం వద్ద పురపాలక సంఘం నిర్వహిస్తున్న కంపోస్టుయార్డు ప్రాంతాన్ని చెన్నై కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ డైరెక్టర్ హెచ్‌డీ వరలక్ష్మి నేతృత్వంలో ఏపీ కాలుష్య ని యంత్రణ మండలి ఈఈ కేవీ. రావు, కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యుల ప్రత్యేక బృందం శుక్రవారం పరిశీలించింది. కంపోస్టుయార్డు, పరిస ర ప్రాంతాల్లో పొలాలు, నివాసిత ప్రాంతాలు, చెరువులు, పంట కాల్వలను పరిశీలించి స్ధానికులతో చర్చించారు. పలు చోట్ల నీటి నమూ నాలు సేకరించారు. గాలిలో కాలుష్యాన్ని గుర్తిం చేందుకు పలు చోట్ల పరికరాలను ఆమర్చారు. రెండు రోజుల పాటు కాలుష్య శాతాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించను న్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపోస్ట్ యార్డుతో కాలుష్య పరిస్థితులను పరిశీ లించారు. కమిటీ రాకను తెలుసుకున్న స్థానికులు కొందరు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. తమ సమస్యలను బందానికి నివేదించారు. శనివారం కూడా ఈ బృందం పర్యటించనుంది.
మూడు దశాబ్దాల కంపు
పట్టణంలో 30ఏళ్లుగా కంపోస్టుయార్డును గోదావరి తీరాన్నే నిర్వహిస్తున్నారు. దీనివల్ల నదీ జలాలు కలుషితమై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పై పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఓసూ రి దేవేంద్ర ఫణికర్ ఢిల్లీ లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ చెన్నైలోని కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ డైరెక్టర్‌ను విచారిం చి నివేదికను అందించాలని అదేశించింది. కాలు ష్య నియంత్రణ మండలి, కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీని కూడా ఈ కమిటీలో నియమించింది. జనవరి 7 నాటికి నివేదికను అందించాలని సంయుక్త కమిటీని ఆదేశిం చారు. ఈ నేపథ్యంలో కమిటీ నరసాపురం ప్రాంతాన్ని సందర్శించింది.
ఎలా భరిస్తున్నారు..
పరిశీలనకు వచ్చిన ఆధికారులు ఏటిగట్టు ప్రాంతంలో కంపోస్టు యార్డును పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. పరిసర ప్రాంత ప్రజలు ఎలా ఉంటున్నారని దిగ్ర్భాంతి చెందారు. చెత్త ప్రభావంతో తాము కొద్ది సమయంలోనే ఇబ్బంది పడ్డాం.. 30ఏళ్లుగా ఎలా భరిస్తున్నారంటూ ఆందోళన చెందారు. స్ధానికులు ఇబ్బందులు తెలియజేయడంతో సమీ పంలో ఉన్న పాఠశాల, కాలేజీని కూడా పరిశీలిం చారు. దగ్గరలోని పంట కాల్వ నీటిని సేకరిం చారు. పడవపై గోదావరిలోకి వెళ్లి నీటి నమూనా సేకరించారు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. న్యాయస్ధానంకు సంబంధించిన అంశం కావడం తో ఏమి చెప్పలేమని స్పష్టం చేశారు.