క్రీడలు విద్యార్థి జీవితానికి ఉత్తేజం
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:45 AM
క్రీడలు విద్యార్థి జీవితాన్ని ఉత్తేజితం చేస్తాయని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) బి.ప్రభాకర రావు అన్నారు.
బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పెదవేగి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): క్రీడలు విద్యార్థి జీవితాన్ని ఉత్తేజితం చేస్తాయని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) బి.ప్రభాకర రావు అన్నారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో పెదవేగిలో రెండు రోజుల పాటు జరగనున్న అండర్ 19 రాష్ట్ర స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. క్రీడలు విద్యార్ధులను ఉన్నతమైన భవిష్యత్ దిశగా నడిపిస్తాయని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఏదొక క్రీడలో ప్రావీణ్యం సాధించాలన్నారు. ప్రతిఒక్కరూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తారని, కానీ విజయం ఒకరినే వరిస్తుందన్నారు. ఓటమితో జీవితం ముగిసినట్లు కాదని, రేపటి విజయానికి తొలిమెట్టుగా స్ఫూర్తితో ముందుకెళ్ళాలని ఆయన సూచించారు. మన విజయం మరొకరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రస్థాయిలో ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు మొత్తం 26 పాల్గొనే ఈ పోటీల్లో ప్రతిఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెదవేగిలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.వెంకటేశ్వరరావు, క్రీడా పరిశీలకుడు డి.రాజేంద్రప్రసాద్, ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.జయరాజు, పీఈటీ గురుమూర్తి, ఆయా జిల్లాల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
అంతర్ జిల్లా టెన్నికాయిట్ పోటీలు
చింతలపూడి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని నూజివీడు ఉప విద్యాశాఖ అధికారి ఎం.సేవియా అన్నారు. స్థానిక ప్రభుత్వ హైస్కూ ల్ ఆవరణలో 68వ ఏపీ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ టెన్నీకాయిట్ పోటీలు శనివారం ప్రారంభ మయ్యాయి. ఆటలతో ఆరోగ్యంగా ఉంటార న్నా రు. క్రీడాకోర్టులను ప్రారంభించిన సీఐ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడా అనుభవాలను తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పావని మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడా పరీశీలకులు ఎన్‌టి. ప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేశారు. గతేడాది స్కూల్ గేమ్స్‌లో తొలగించిన టెన్నీకాయిట్ పోటీ లను జాతీయస్థాయిలో జరిగేవిధంగా పునరుద్ధ రించాలన్నారు. అంతర్జ్జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారన్నారు.
అండర్ 14, 17, 19 విభాగాలలో లీగ్‌నాకౌట్ పద్ధతిలో శనివారం, ఆదివారం జరిగే పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారు. తొలిరోజు బాలికలు 195, బాలురు 190, కోచ్‌లు78 మంది, 40 మంది టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన లక్ష్మణ్, మాధురి, జాతీయస్థాయిలో పతక విజేతలు ఎనిమిది మందిని సన్మానిం చారు. అలివేలు మంగ, సురేష్‌కుమార్, సుధాకర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.