చేదు పుట్టిస్తున్న తియ్యని వ్యాధి
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:36 AM
డయోబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని భారత్‌ను పిలవడం మనం సంతోషించదగ్గ విషయం ఎంత మాత్రం కానే కాదు. ప్రగతిలో ముందు ఉన్నామంటే ఆనందదాయకం. పౌరులలో ఒక దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్య విషయంలో ప్రపంచంలోనే మనం ప్రథమంగా ఉన్నామని గుర్తించబడడం విచారించాల్సిన విషయం.
మారుతున్న జీవనశైలితోనే ఇబ్బందులు
మధుమేహంలో మనమే ప్రథమం
డయోబెటిస్ క్యాపిటల్‌గా ’భారత్’
ప్రతీ పది మందిలో ఒకరికి..
2045 నాటికి 140 మిలియ న్లకు చేరవచ్చని అంచనా.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఆరు లక్షల మందికి మధుమేహం
డయోబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని భారత్‌ను పిలవడం మనం సంతోషించదగ్గ విషయం ఎంత మాత్రం కానే కాదు. ప్రగతిలో ముందు ఉన్నామంటే ఆనందదాయకం. పౌరులలో ఒక దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్య విషయంలో ప్రపంచంలోనే మనం ప్రథమంగా ఉన్నామని గుర్తించబడడం విచారించాల్సిన విషయం. ప్రపంచంలో మొత్తం మధుమేహ బాధితులలో 17 శాతం మన దేశంలో ఉండడం గమనార్హం. ప్రతీ పది మంది వయోజనులలో ఒకరికి మధుమేహం ఉంది. ఇప్పుడు దేశంలో దాదాపు 80 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 140 మిలియన్లకు చేరవచ్చని అంచనా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పలు గణాంకాల ప్రకారం ఆరు లక్షలు ఉండవచ్చని అంచనా. మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ జయంతి పురస్కరించుకుని నవంబరు 14వ తేదీని ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
పాలకొల్లు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి)
చక్కెర వ్యాధి, లేదా డయాబెటిక్, లేదా మధుమేహం ఏ పేరుతో పిలిచినా వాటి బారిన పడిన పౌరులు ఔషధాల జోలికి పోకుండానే తమ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా 80 శాతం మందిలో సమస్యను నియంత్రించవచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. మధుమేహం సమస్య మానవ శరీరంలో ఇన్సులెన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రయత మితబాలిజం మధుమేహంతో బాధపడేవారిలో ప్రధానంగా అతిమూత్రం. అతిదాహం. చూపు తగ్గడం ఆకస్మికంగా బరువు తగ్గడం, మూత్రపిండాల వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.
ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపుల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 21,847గా ఉంది బీపీ, చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 62,036గా ఉంది. ఏలూరు జిల్లాలో 23,460 మంది ఉండగా చక్కెర, బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య 74,162గా ఉంది. ఫ్యామిలీ ఫిజిషియన్ క్యాంపుల ద్వారా ఉమ్మడి పశ్చిమ జిల్లాలో సుమారు 30 శాతం పౌరులలో 1లక్షా 80వేల మందికి వ్యాధి ఉందని గుర్తించగా అదే నిష్పత్తిలో మిగిలిన పౌరులలో మరో నాలుగు లక్షల పైబడి చక్కెర వ్యాధి ఉండే అవకాశాలు ఉన్నాయని సంబంధిత శాఖలో నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఆరు లక్షలు పైబడిన పౌరులలో మధుమేహం సమస్య ఉంది. దేశంలోని వయోజనులలో 7.7 కోట్లు మందికి మధుమేహం ఉందని గుర్తించారు. ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ప్రతీ పది మందిలో ఒకరికి డయాబెటిస్ ఉన్నట్టు తెలుస్తుంది.
చిరుప్రాయంలోనే మధుమేహం
అత్యంత దురదృష్టకరమైన విషయం చిరు ప్రాయంలోనూ మధుమేహం రావడం. మారుతున్న జీవనశైలి శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం. ఊబకాయం, తల్లి దండ్రుల ద్వారా వంశపార్యంపరంగానూ పసిపిల్లలు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
యువతలో పది శాతం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) నివేదిక ప్రకారం మన జనాభాలో ముఖ్యంగా యువతలో గత కంటే ఇప్పుడు పది శాతం మధుమేహం పెరుగుదల కనిపిస్తుంది. పిల్లల్లో సైతం పెరుగుతూ రావడం ఆందోళన కల్గిసుందని ఐసీఎమ్‌ఆర్ నివేదికలో పేర్కొంది.
మధ్య వయస్సు వారికి తీవ్రం.. ముఖ్యంగా మధ్య వయస్సు వారికి మధుమేహం సమస్య తీవ్రమైంది. అధిక కేలరీల గల ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, ఆందోళనలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అధికంగా మద్యపానం చేసే వారిలోనూ ధూమపానం చేసే వారిలోనూ వేగంగా ఈవ్యాధి పెరుగుతుంది. వీటికి తోడు కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) సైతం మధుమేహాన్ని కలుగజేస్తుంది.
డబ్ల్యూహెచ్‌వో స్పందన
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మధుమేహంపై స్పందనను వేగవంతం చేసింది. 2021 ఏప్రిల్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ డయాబెటిస్ కాంపాక్ ప్రారంభించింది. నవంబరు 14వ తేదీన ప్రపంచ మధుమేహం వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఇన్సులెన్ ఇంజక్షన్‌లకు చెక్
షెల్‌ట్రాన్స్‌పాంటేషన్‌తో మధుమేహ బాధితులకు స్వాంతన కల్గించవచ్చని ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ఓ సదస్సులో పలువురు వైద్యప్రముఖులు ప్రకటించడం పట్ల మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నియంత్రణ సాధ్యమే..
క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ఆకు కూరలు అధికంగా తీసుకోవడం, పిండి పిండి పదార్థాలు లేని కాయగూరలు వినియోగం, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, పరిమిత ఆహారం తీసుకోవడం ద్వారా అదుపులో పెట్టవచ్చు మానసిక ప్రశాంతత, యోగా మఽధుమేహాన్ని దూరం పెడతాయి. ఇది వ్యాధిగా చూడాల్సిన అవసరం లేదని అది దీర్ఘకాలిక సమస్య అని జీవన శైలి ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని వైద్యవర్గాలు చెబుతు న్నాయి. మధుమేహ వ్యాది సమస్య బారిన పడినవారిలో 50 శాతం మందికి మాత్రమే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోగల్గు తున్నారు. ఈఅంశంపై వైద్యవర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మితంగా ఆహారం తీసుకుంటా
నాకు ఐదేళ్లుగా డయాబెటిస్ ఉంది. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో వైద్యుల సూచనల మేరకు మాత్రలు వేసుకుంటూ మితంగా ఆహారం తీసుకుంటా.. వీలైనంత వరకు శారీరక శ్రమ ఉండేలా చూస్తా.. దుంప కూరలు తినకుండా ఎక్కువగా ఆకుకూరలు తింటూ డయాబెటిస్ అదుపులో ఉండేలా చూస్తాను.
– ఎన్. సుబ్బారావు, నాలుగో డివిజన్, ఏలూరు.