Share News

టీచర్స్‌ సమరం

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:38 AM

ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ పదవికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది.

టీచర్స్‌ సమరం

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ పదవికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 11న అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఆ తరువాత నామినేషన్ల పర్వం, వచ్చే నెల 5న పోలింగ్‌ నిర్వహిస్తారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆది నుంచి ఉత్కంఠభరితంగా, ఏదొక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నవారే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ఎన్నికలకు రాజకీయ రంగు తప్పనిసరి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. వచ్చేనెల 9 వరకు కోడ్‌ కొనసాగుతుంది. ఈ కారణంగా ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారమే అన్ని నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు సమరంలా సాగబోతున్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బహుమతుల పంపి ణీ, ఓట్లకు నగదు పంపిణీతో నానా రభస సృష్టిం చారు. సాధారణ ఎన్నికలను తలపించేలా నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ నడిచింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదులో నియోజకవర్గాల వారీగా భారీ కసరత్తు జరిగింది. అధికార టీడీపీ ఈ అంశంలో ఒకింత ముంద డుగులోనే ఉంది. ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వీలుగా ఎన్నికల సంఘం నగారా మోగించింది.

ఇంతకుముందు ఏం జరిగిందంటే..

శాసన మండలి ఇంతకుముందు రద్దుకాగా ముఖ్యమంత్రిగా వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు శాసన మండలిని పునరుద్ధరించారు. స్థానిక సం స్థలతో పాటు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియో జకవర్గాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిం చడం ఆరంభించారు. శాసనమండలి పునరుద్ధ రణ జరిగిన 2007లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అప్పట్లో శేషారెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం సాగింది. తగ్గట్టు గానే ఓటర్ల ఇళ్ల వరకు గిఫ్ట్‌లు చేరాయి. అలిగి ఓటింగ్‌కు దూరంగా ఉంటామని బెదిరించిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. తర్వాత 2009లో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్యరాజు ఎన్నికల బరిలో దిగి పెద్ద ఎత్తున హడావుడి చేశారు. చైతన్యరాజు దూకుడు ముందు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేకపో యారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లు అయిన ఉపా ధ్యాయులకు ఇష్టం ఉన్నా, కష్టమున్నా నేరుగానే బహుమతుల వరద పారింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే సాధారణ ప్రజల్లో సైతం ఆసక్తిని, ఒకింత విమర్శను లేవనెత్తాయి. తిరిగి 2015లో యూటీఎఫ్‌ పక్షాన రాము సూర్యారావు (ఆర్‌ఎస్‌ఆర్‌)ను రంగంలోకి దింపారు. సీఆర్‌ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్‌ అయిన ఆర్‌ఎస్‌ఆర్‌కు సోషల్‌ వర్కర్‌గా పేరుంది. పేద విద్యార్థులకు సాయపడే గుణం ఉన్న ఆయనను అందరూ అక్కున చేర్చుకునేవారు. యూటీఎఫ్‌ నాయకత్వం ఏరికోరి అప్పట్లో ఆర్‌ఎస్‌ఆర్‌ను రంగంలోకి దింపి ఉభయగోదావరి జిల్లాల్లోని దాదాపు 600 హైస్కూళ్లలో దగ్గరుండి మరీ ప్రచారం చేయించారు. ఆయన మంచితనంతో అలవోకగా గెలుపొందారు. ఆయన విజయం అప్పట్లో ఒక సంచలనం. రాజకీయంగా, వ్యక్తి గతంగా వివాదరహితుడైన ఆర్‌ఎస్‌ఆర్‌ ఎన్నికను అందరూ స్వాగతించారు. అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆర్‌ఎస్‌ఆర్‌ విజయాన్ని కీర్తించారు. తర్వాత యూటీఎఫ్‌ నుంచి సాబ్జీని రంగంలోకి దించడం ఆయన కూడా అలవోకగా గెలుపొందారు. శాసన మండలి పునరుద్ధరణ తరువాత నాలుగుసార్లు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా రెండుసార్లు యూటీ ఎఫ్‌ అభ్యర్ధులే గెలుపొందడం ఓ రికార్డు.

ఎవరెవరికి ఓటుంటుంది

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైస్కూల్‌ ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హతలేదు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈసారి సంఘాల వారీగా ఒకింత మార్పు, చేర్పులు జరిగాయి. రాజకీయ పక్షాలకు అనుబం ధంగా కొన్ని సంఘాలు పుట్టుకొచ్చాయి.

కోడ్‌ అమలులోకి వచ్చింది

విశ్వేశ్వరరావు, డీఆర్వో

ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 11న నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఎన్నికల ఏర్పాట్లను డీఆర్వో విశ్వేశ్వ రరావు సోమవారం మీడియాకు వివరించారు. ఈనెల 11న ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ, అదే రోజు నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. వచ్చేనెల 5న పోలింగ్‌, డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల నియమావళి అమలు లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

యూటీఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తి

యూటీఎఫ్‌ అభ్యర్ధిగా భీమవరం ప్రాంతానికి చెందిన డి.గోపిమూర్తిని అధికారికంగా ప్రకటించింది. ఈసారి కూడా హ్యాట్రిక్‌ సాధిస్తామనే ధీమాతో యూటీఎఫ్‌ ఉంది. అయితే మిగతా పక్షాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినైనా రంగంలోకి దింపుతాయా, లేదా అనేది గురువారం నాటికి తేలనుంది. ఆలోపు సరైన నిర్ణయం తీసుకోవాలని పార్టీల కార్యరక్తలు తమ నాయకత్వాలకు ఇప్పటికే విజ్ఞప్తి చేయడం ఆరంభించారు. ఎలాగూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాల తరపున ఎవరినైనా రంగంలోకి దించుతారా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ పక్షాన అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఇదే ధోరణిలో నిర్ణయం తీసుకుంటే ఎవరైనా విశ్రాంత ఉపాధ్యాయుడిని రంగంలోకి దించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 12:38 AM