Share News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోటా పోటీ

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:26 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. గురువారం పోలింగ్‌ జరగనుంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోటా పోటీ

రేపే పోలింగ్‌.. ముగిసిన ప్రచారం

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాలు

మొత్తం ఓటర్ల సంఖ్య 2,605

బ్యాలెట్‌ పత్రాల వినియోగం

మద్యం దుకాణాలు బంద్‌

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. గురువారం పోలింగ్‌ జరగనుంది. జిల్లావ్యాప్తంగా 20 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు బ్యాలెట్‌ పత్రాలను వినియోగిస్తారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది కాబట్టి మంగళవారం సాయంత్రం నాటికే ఎక్కడికక్కడ మద్యం దుకాణాలను బంద్‌ చేశారు. ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు తలపడుతున్నారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆయా ఉపాధ్యాయ సంఘాలు భుజానికెత్తుకున్నాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలకు వీలుగా అన్ని ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే ప్రచారంలో అభ్యర్థులంతా నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు. బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావు, దీపక్‌, కవల నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీలో ఉన్నారు. వీరిలో గోపిమూర్తి, గంధం నారాయణరావు మధ్య భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే వీరిద్దరికి ఉపా ధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చాయి.

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. గడిచిన పక్షం రోజులుగా జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరినీ వ్యక్తిగతంగాను, పాఠశాలలు, వారి నివాసాల్లోను కలిసి మద్దతు కోరారు. తొలిసారిగా గోపిమూర్తి బరిలో ఉండగా, గంధం నారాయణరావుకు మరో సారి అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. ఉపాధ్యాయ వర్గాలు కూడా ఎక్కడికక్కడ తామే బాధ్యత వహించి ప్రచారంలో అభ్యర్ధుల పక్షాన ప్రచారం నిర్వహిం చారు. గోపిమూర్తికి యూటీఎఫ్‌తో పాటు పలు సంఘాలు మద్దతు ఇవ్వగా, గంధం నారాయణ రావుకు ఎస్టీయూ, మరికొన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ నువ్వానేనా అన్నట్టుగా గడిచిన మూడు రోజులుగా మారి పోయింది. సీనియర్‌ అయిన తనకు ఒక అవకా శం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్క రిస్తామని గంధం నారాయణరావు ప్రచారం చేయగా, షేక్‌ సాబ్జీ మరణానంతరం ఉపాధ్యాయుల హక్కులను కాపాడే సత్తా తమకే ఉందని, తాము బలపరిచే అభ్యర్ధి గోపిమూర్తికి ఓటు వేయాలని యూటిఎఫ్‌ కోరుతుంది. వామపక్షాలు రెండు చెరోవైపు విడిపోయి మరీ భారీ ఎత్తున గడిచిన వారం రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించాయి.

గతం కంటే భిన్నంగా..

ఈసారి ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో గతంకంటే భిన్నమైన పరిస్థితే అభ్యర్ధుల మధ్య నెలకొంది. గతంలో ఓటర్లను ఆకర్షిం చేందుకు పెద్ద ఎత్తున తాయిలాలు విసిరారు. డబ్బు చేతులు మారింది. ఉపాధ్యాయులను ప్రస న్నం చేసుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేశారు. ప్రచారాన్ని సాధారణ ఎన్నికలను తల పించేలా హోరెత్తించారు. కాని ఈసారి మాత్రం దానికి భిన్నంగా ప్రచారంలో అభ్యర్ధులు ఉన్నా, లేకపోయినా వారికి మద్దతు ఇచ్చిన సంఘ సభ్యులే ప్రచారాన్ని భుజానకెత్తుకున్నారు. మం గళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. రాబోయే 24 గంటల్లో గతంలో మాదిరిగానే ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎవరైనా సాహసం చేస్తారా అనే సందిగ్దత లేకపోలేదు. ఈ దిశగానే ఓటర్లలో కొందరు తాయిలాల కోసం ఇప్పటి నుంచే ఆరా తీయడం ప్రారంభించారు.

పోలింగ్‌లో బ్యాలెట్‌ పత్రాల వినియోగం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్‌లో బ్యాలెట్‌ పత్రాలను వినియోగి స్తున్నారు. ఈ మేరకు నిర్దిష్ట ఆదేశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2605 మంది ఓటర్లు ఉండగా వారంతా కూడా ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్‌లోనే పోటీ చేస్తున్న వ్యక్తులకు మద్దతు పలుకుతూ టిక్‌ పెడతారు.

జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్య లగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, కామ వరపుకోట, ద్వారకాతిరుమలలో పోలింగ్‌ కేంద్రా లను ఏర్పాటు చేశారు. చింతలపూడి, లింగపా లెం, ఉంగుటూరు, భీమడోలు, పెదవేగి, పెదపా డు, ఏలూరురూరల్‌, ఏలూరు అర్బన్‌, దెందు లూరు, నిడమర్రు వంటి కేంద్రాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికా రులు తెలిపారు.

విధులు సర్దుబాటు చేయాలి

పోలింగ్‌ గురువారం ఉదయం 8 గంటల నుం చి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహి స్తారని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ప్రకటించారు. జిల్లాలో అన్ని ప్రైవేటు మేనేజ్‌మెంట్‌లు, అథారిటీలు, ఓటరుగా ఉన్న తమ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు అంటే డ్యూటీకి ఆలస్యంగా రావడం, షిఫ్ట్‌ సర్దు బాటును చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌ సవ్యంగా సాగేలా ఎక్కడికక్కడ బందో బస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పోలింగ్‌కు ముందుగానే మంగళ వారం మద్యం దుకాణాలను, బార్‌లను ఎక్కడి కక్కడ మూసివేశారు. మంగళవారం సాయంత్రం నుంచి దుకాణాల మూత జరిగిందో, లేదో అధికారులు పర్యవేక్షించారు. ఈనెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల కోడ్‌ అప్పటిదాకా అమలులో ఉంటుంది.

ఓటేయడానికి వెళితే.. పాఠశాల నిర్వహణ ఎలా..?

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 3(ఆంద్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీచర్లు ఓటుహక్కు వినియోగించు కోవడంపై డైలమా నెలకొంది. హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ప్రకటించిన వంద రోజుల కార్యాచరణలో మార్చి 10 వరకు ఆదివారాలతో సహా (సంక్రాంతి సెలవుల్లో 3 రోజులు మినహా) ప్రత్యేక తరగతుల నిర్వహణను ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్‌ గురువారం జరుగనుంది. ఓటుహక్కు వున్న టీచర్లకు ఆ రోజున స్పెషల్‌ క్యాజువల్‌ లీవును మంజూరుచేస్తూ విద్యాశాఖ ఉన్నతాదికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడే సమస్య వచ్చిపడింది. హైస్కూలులో బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ టీచర్లందరికీ దాదాపు ఓటుహక్కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటుహక్కు వినియో గించుకునేందుకు సంబంధిత టీచర్లందరూ స్పెషల్‌ సీఎల్‌ను వినియోగించుకుంటే స్కూలును లేదా వంద రోజుల కార్యాచరణను నిర్వహించడం అసాధ్యమైనందున ఆ రోజున స్కూలు అంతటికీ వర్తించేలా స్థానిక సెలవు (ఎల్‌హెచ్‌)ను ప్రకటిం చాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌. ఒకవేళ ఓటుహక్కులేని ఒకరిద్దరు టీచర్లున్నా స్కూలును నిర్వహించడం సాధ్యం కాదని చెబుతున్నాయి.

ఈ విషయాన్ని డీఈవో వెంకటలక్ష్మమ్మ విద్యా శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లా రు. పరిష్కారం కోసం మంగళవారం రాత్రివరకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ డైలమాపై డీఈవోను వివరణకోరగా.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరిగే కేంద్రాలకు(పాఠశాలలు) 4, 5 తేదీల్లో స్థానిక సెలవును ప్రకటించాం. ఈ రెండురోజులకు పరిహారంగా మరో రెండు సెలవు దినాల్లో స్కూలు పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఓటుహక్కును వినియోగించు కోడానికి వీలుగా హైస్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలనే అభ్యర్థనలను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్ళి వారి నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తాం’ అని వివరించారు.

షిఫ్ట్‌ల వారీగా విధులు..?

ఏలూరుజిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కకు మొత్తం 2667 మంది టీచర్‌ ఓటర్లున్నారు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారంగా స్కూలులో ఓటుహక్కువున్న మొత్తం టీచర్లలో ఉదయం, మధ్యాహ్నం చెరిసగం మందికి షిఫ్ట్‌ మాదిరిగా ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించి, స్కూలు మూసివేయకుండా చర్యలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నారు. లేదా స్థానికంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ప్రత్యేక తరగతుల నిర్వహణకు అడ్జస్ట్‌మెంట్‌ చేసుకునేలా సూచనలు చేసే ప్రతిపాదనలు అధికారుల పరిశీలనలో వున్నట్టు తెలిసింది. దీనిపై మంగళవారం రాత్రి వరకు ఎటువంటి అదికారిక ప్రకటన లేదు. ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం పాఠశాల మూసివేతపై స్పష్టత రానుంది.

Updated Date - Dec 04 , 2024 | 12:26 AM