Share News

టెన్షన్‌.. టెన్షన్‌

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:18 AM

సార్వా సాగుపై వాయుగుండం ప్రభావం చూపింది. శుక్రవారం ఈదురుగాలులు, చిరుజల్లులు పడటంతో ధాన్యం రాశులు భద్రపరుచుకోవడంలో రైతులు పరుగులు పెట్టారు.

టెన్షన్‌.. టెన్షన్‌
ఆచంటలో ధాన్యం రాశులపై కప్పిన బరకాలు

కల్లాల్లో ధాన్యం.. రైతుల కళ్లల్లో దైన్యం

తుఫాన్‌ ప్రభావం.. చిరుజల్లులు ప్రారంభం

పంటను రక్షించేందుకు బరకాలతో కల్లాల వైపు పరుగులు

కష్టం వృఽథా చేయవద్దని వరుణుడికి వేడుకోలు

15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాశులు

లక్షా 20 వేల ఎకరాల్లో పూర్తి కాని మాసూళ్లు..

భీమవరం రూరల్‌/నరసాపురం/పెంటపాడు/ గణపవరం/ఆచంట/పాలకొల్లు రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సార్వా సాగుపై వాయుగుండం ప్రభావం చూపింది. శుక్రవారం ఈదురుగాలులు, చిరుజల్లులు పడటంతో ధాన్యం రాశులు భద్రపరుచుకోవడంలో రైతులు పరుగులు పెట్టారు. పంట మాసూళ్లు నిలిచిపోయాయి. వర్షం గట్టిగా పడితే పంట దశకు చేరిన చేలు నెలకొరిగి దెబ్బ తింటామని కంగారు పడుతున్నారు. జిల్లాలో రెండు లక్షల వరకు సార్వా సాగు జరగ్గా, 80 వేల ఎకరాలు పంట మాసూళ్లు అయ్యింది. లక్షా 12 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యంపైగా విక్రయాలు జరిగాయి. ఇంకా 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాశులుగా రైతుల వద్ద ఉంది. లక్ష 20 వేల ఎకరాల పంట మాసూళ్లు చేయాలి. వాతావరణం కనికరిస్తేనే పంట గట్టెక్కుతుంది. ధాన్యం అమ్మకాల్లో వాయుగండంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తేమ శాతం ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తున్నారు. క్వింటాలు ధాన్యానికి ఒక పాయింట్‌ తేమ శాతం ఎక్కువ ఉంటే కేజీ ధాన్యం ఎక్కువ ఇచ్చి అమ్మకాలు చేస్తున్నారు. మూడు రోజులపాటు తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వరి కోతల జోలికి వెళ్లవద్దని అధికారులు కోరుతు న్నారు. పెంటపాడు మండలంలో ఎకరానికి రూ.35 వేల వరకు పెట్టుబ డులు పెట్టి పండించుకున్న తమ పంట ఏమవు తుందోనని రైతులు బెంబేలెత్తారు. సాయంత్రం కురి సిన చిరుజల్లులు కాస్త తగ్గుముఖం పట్టేసరికి ఊపిరి పీల్చుకున్నారు. తమ కష్టం వృఽథా చేయవద్దని, ఎటు వంటి నష్టం తమకు కలగనివ్వవద్దని వాన దేవుడిని వేడుకుంటున్నారు. గణపవరం మండలంలో ధాన్యా న్ని ట్రాక్టర్లతో పొలాల నుంచి బయటకు తరలిస్తు న్నారు. కొంత మంది రోడ్లపైనే ఆరబెడుతున్నారు. మరికొందరు వరి పనల పరిస్థితిపై ఆందోళన చెందు తున్నారు. మండలంలో 12 వేల ఎకరాల్లో పంటల నూర్పిడి పూర్తయ్యింది. మరో ఆరు వేల ఎకరాల పంటపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యవసాయాధికారి వైవీఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ తుఫాన్‌ కారణంగా వరి కోతలు కోయవద్దని రైతు లకు సూచించారు. పాలకొల్లు రూరల్‌ గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలంలో 1800 ఎకరాల్లో మాసూళ్లు పూర్తి కాగా, ఏడు వేల ఎకరాల్లో చేయాల్సి ఉంది. కళ్లాల్లో వున్న ధాన్యాన్ని వబ్బిడి చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.

సముద్రం అల్లకల్లోలం

తుఫాన్‌ ప్రభావంతో తీరంలో శుక్రవారం సాయంత్రం నుంచి బలమైన ఈదురుగాలులు, వర్షపు జల్లులు మొదల య్యాయి. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గింది. చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. సముద్రం అల్లకల్లో లంగా మారింది. బలమైన గాలులు వీస్తుండటంతో తీరగ్రామాల్లో బయటకు రాలేని పరిస్థితి. ఇటు సముద్ర హోరు, బలమైన అలలు తీరాన్ని తాకుతుండటంతో ఒడ్డుకు వెళ్లే అవకాశం లేదు. తుఫాన్‌ హెచ్చరికతో మత్స్యకారులు వలలు, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేటకు వెళ్లిన బోట్లలో కొన్ని నరసాపురం లాకుల వద్దకు రాగా, మరికొన్ని అంతర్వేది ఒడ్డుకు వెళ్లాయి.

Updated Date - Nov 30 , 2024 | 12:18 AM