Share News

మనసున్న మారాజు

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:52 PM

మొగల్తూరు ముద్దు బిడ్డ.. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు. మనసున్న మారాజుగా కీర్తిగడించారు.

మనసున్న మారాజు

వెండి తెరపై రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు

ఎంపీగా, కేంద్ర మంత్రిగా జిల్లా అభివృద్ధిపై ముద్ర

నేడు జయంతి.. మొగల్తూరులో మెగా వైద్య శిబిరం

మ్యూజియం, స్మృతివనం ఏర్పాటుకు మంత్రుల హామీ

ఏడాదిన్నరైనా ఆ దిశగా పడని అడుగులు

మొగల్తూరు, జనవరి 19 : మొగల్తూరు ముద్దు బిడ్డ.. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు. మనసున్న మారాజుగా కీర్తిగడించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఉప్పలపాటి నారాయణమూర్తిరాజు లక్ష్మీదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. మూడో సంతానంగా కృష్ణంరాజు 1940 జనవరి 20న మొగల్తూరులో జన్మించారు. విద్యాభ్యాసం మొగల్తూరు, నరసా పురం, హైదరాబాద్‌లో జరిగింది. రోడ్డు ప్రమాదంలో మొదటి భార్య మృతితో 1996లో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మాజీ మంత్రి గాంధేయవాది, సీహెచ్‌వీపీ మూర్తిరాజు ద్వారా 1968లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అంచలంచెలుగా ఎదిగి 183 సినిమాల్లో హీరోగా, విలన్‌గా విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. కృష్ణంరాజు తొలుత కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చినప్పటికీ 1996 ప్రాంతంలోనే బీజేపీలో చేరారు. 1998 కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999 నర్సాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి లక్షా 50 వేలపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవి వరించింది. ఐదేళ్లలో ఆయన పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. కృష్ణంరాజుకు మొగల్తూరు అంటే ఎంతో మమకారం. ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారు. 1986 వరదలు, ఇతర విపత్తు సమయాల్లో ప్రజలకు సహాయం చేసి స్వగ్రామంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి కేంద్ర గ్రామీణ సడక్‌ యోజన పేరుతో సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కాలంలో తనను రాజకీయంగా నిలబెట్టి కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించిన బీజేపీతో చివరి వరకు కొనసాగారు. 2022 సెప్టెంబరు 11న 82వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు.

ఏడాదిన్నరైనా కనిపించని స్మృతివనం

మొగల్తూరులో 2022 సెప్టెంబర్‌ 29న రాష్ట్ర ప్రభుత్వం కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ‘కృష్ణంరాజు పేరిట పేరుపాలెం తీరంలో రెండు ఎకరాల భూమిలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. మొగల్తూరులో ఒక పంచాయతీ చెరువును వాకింగ్‌ ట్రాక్‌గా మార్చి స్మృతి వనం నిర్మిస్తాం’ అంటూ మంత్రులు ఆర్‌కే రోజా, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు ప్రకటించారు. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. కాని, ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదు. కృష్ణంరాజుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా ? అని అభిమానులు, గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.

నేడు మెగా వైద్య శిబిరం

కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మొగల్తూరు అబ్యాస్‌ కళాశాలలో శనివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కుమార్తెసాయి ప్రసిద్ద రెండు రోజులుగా మొగల్తూరులోనే ఉన్నారు. ఈ క్రమంలో స్థానికులు, అభిమానులు శ్యామలాదేవిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. దేశ, విదేశాలకు చెందిన 30 మంది ప్రముఖ వైద్యులతో నిర్వహించే వైద్య శిబిరానికి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనా యుడు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Jan 19 , 2024 | 11:52 PM