సమన్వయం కుదిర్చేనా ?
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:04 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సమావేశం కానున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారి భీమవరం రానున్నారు.
నేడు ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి భీమవరం రాక
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం
జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సమావేశం కానున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారి భీమవరం రానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు భీమవరంలో రహదారుల మరమ్మతులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. తర్వాత టీడీపీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. మల్టీఫ్లెక్స్‌లోని కల్యాణ మండపంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో, రాష్ట్ర ప్రతినిఽధులు, సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మూడు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తారు. జిల్లా అభివృద్ధిపై మధ్యాహ్నం రెండు గంటలకు కలెక్టరేట్‌లో రవికుమార్ సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. సమస్యలపైన, సంక్షేమ పథకాల అమలు తీరుపైన చర్చిస్తారు. జిల్లా ఇసుక ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వం ఉచిత ఇసుకను అమలు చేస్తున్నప్పటికీ ధరలు అందుబాటులోకి రావలేదు. దీనివల్ల నిర్మాణ రంగం కుదేలైంది. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని కూటమి నాయకులు నిర్ణయించారు. ముఖ్యంగా దీనిపై చర్చించనున్నారు.
నామినేటెడ్ పదవులపై ఆశ
ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యటన ఖరారు కావడంతో కూటమి నేతల్లో నామినేటడ్ పదవులపై ఆశలు రెకేత్తాయి. పదవుల పంపకంపై సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఒక స్పష్టత ఇచ్చారు. సహకార సంఘాలల్లో ద్విసభ్య కమిటీల ఏర్పాటు, నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు ఇతర పదవులపైన ఇన్‌చార్జ్ మంత్రి సమక్షంలో మూడు పార్టీల మధ్య స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య స్పర్థలు కనిపిస్తున్నాయి. ఆదిలోనే వీటిని పరిష్కరించకపోతే ఇవి మరింత ముదిరే అవకాశం వుంది. ఎన్నికల్లో కూటమి పార్టీల, అభ్యర్థుల గెలుపు కోసం అంతా కలిసి పనిచేశారు. కాని, ఎన్నికల అనంతరం సయోధ్య కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన నాయకులు ఇప్పుడు కూటమిలో ఏదో పార్టీ పక్షన చేరి పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది కూటమి తరపున కష్టపడిన వారికి ఇబ్బందిగా మారింది. నియోజకవర్గ నేతల మధ్య స్పర్ధలకు దారి తీస్తోంది. వీటిపై ఇన్‌చార్జ్ మంత్రి దృష్టి సారించి దిశా నిర్దేశం చేయాల్సి వుంది.