నేడు సాగునీటి సంఘాల ఎన్నిక
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:21 AM
ఏళ్ల తరబడి రైతులు ఎదురు చూసిన సాగునీటి సంఘాలకు నేడు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఒక్కరోజులోనే సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక పూర్తి
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
ఏకగ్రీవం దిశగా సంఘాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ఏళ్ల తరబడి రైతులు ఎదురు చూసిన సాగునీటి సంఘాలకు నేడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నడూ ఈ దిశగా కనీసం సమీక్షించనూలేదు. రైతుల అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు సృష్టించలేదు. రెండు పంటలు పండించే గోదావరి జిల్లాల్లో ఈ సంఘాల కీలక పాత్రను ఆనాడు పాలకులు పూర్తిగా మరిచారు. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోపే సాగునీటి సంఘాలకే కాకుండా డిస్టిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించబోతుంది. దీనిలో భాగంగానే శనివారం జిల్లా వ్యాప్తంగా సుమారు 354 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నికయ్యేలా చూడబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి ఉదయం 8 గంటలకు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకోవడానికి వీలుగా అసాధారణ సర్వసభ్య మండలి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 9 నుంచి 9.15 గంటల వరకు ఓటర్లకు నీటి వాడకందారుల ప్రధాన ఉద్దేశాలను, వాటి ప్రాదేశిక నియోజకవర్గ ఏకాభిప్రాయం ద్వారా గుర్తించాల్సిన అవసరాన్ని వివరిస్తారు. ఈ సందర్భంగా ఏకాభిప్రాయం కుదిరితే అంతా ఓకే. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరని పక్షంలో 9.15 నుంచి 9.45 గంటల వరకు ఓటర్ల ఎంపికను చేతులెత్తి ప్రదర్శన లేదా ఓటింగ్ స్లిప్పుల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ప్రాదేశిక నియోజకవర్గం పదాధికారి అభ్యర్థుల పోటీదారుల నుంచి నామినేషన్లను 9.45 నుంచి 10.15లోపు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. 10.30 నుంచి మధ్యాహ్నం 12.30లోపు రెండు గంటల సమయంపాటు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియను నిర్వహిస్తారు. ఇది పూర్తయిన వెంటనే ఓటింగ్ స్లిప్పుల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఒంటిగంటకు పూర్తి చేస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడానికి ప్రత్యేక యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ యావత్ ప్రక్రియను సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
దాదాపు ఏకగ్రీవమే..
ప్రస్తుతం జిల్లాలో కూటమి పక్షాన ఎమ్మెల్యేలదే పైచేయి కావడంతో నీటి సంఘాల ఎన్నికల్లోను ఇదే ధోరణిలో పూర్తి చేస్తారని భావిస్తున్నారు. సంఘాలకు పోటీ జరిగిన అవికూడా కడకు కూటమికి అనుకూల ఫలితాలు వచ్చేలా జాగ్రత్తపడే అవకాశం లేకపోలేదు. పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ధర్మరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోను కూటమి పక్షాన అనుకూలురే అత్యధిక పోటీలో ఉన్నారు. వైసీపీ ఎలాగూ నాయకత్వలోపం ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆ పార్టీ పక్షాన ఎవరూ పెద్దగా ఉత్సాహపడడంలేదు. అలాగే కైకలూరులో బీజేపీ పక్షాన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా టీడీపీ పక్షాన దెందులూరులో చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, చింతలపూడి నుంచి రోషన్‌కుమార్‌తోపాటు మంత్రి కొలుసు పార్ధసారథి నూజివీడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా ఇప్పటికే సాగునీటి సంఘాల ఎన్నికలను పర్యవేక్షించారు. కూటమి పక్షాన సానుకూలురు విజయానికి పూర్తి సంకేతాలు ఇచ్చారు. అక్కడక్కడ వైసీపీ సానుభూతిపరులు పోటీలకు దిగినా ఫలితాల్లో పెద్ద తేడా ఉండదని కూటమి నాయకత్వం ధీమాగా ఉంది.