ట్రామాకేర్..మూసేశారు..!
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:57 AM
ఏలూరులోని జిల్లా ఆసుపత్రి గతేడాది ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిగా మార్పు చెందింది. మెడికల్ కాలేజీ రాకతో ఆసుపత్రిలో మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అంద రూ భావించారు.
ఏలూరు క్రైం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఏలూరులోని జిల్లా ఆసుపత్రి గతేడాది ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిగా మార్పు చెందింది. మెడికల్ కాలేజీ రాకతో ఆసుపత్రిలో మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అంద రూ భావించారు. అప్పటి వరకు ఉన్న 550 పడకల ఆసుపత్రి కాస్త 300 పడకల ఆసుపత్రిగా మార్చి ఒకేసారి 250 పడకలు తగ్గిం చేశారు. ప్రస్తుతం 330 పడకలతోనే ఏలూరు సర్వజన ఆసుపత్రి కొనసాగుతోంది. వైద్య విధాన పరిషత్‌కు చెందిన వైద్యులు, సిబ్బం ది, నర్సులు వేరే వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు బదిలీ చేశా రు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధీనంలో ఉండడంతో ఆ విభాగానికి వైద్యులు, సిబ్బం ది, నర్సులను పంపించారు. సిబ్బంది కొరత ఉండడంతో వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఆరుగురు వైద్యులను డిప్యూటేషన్‌లో ఇప్పటి వరకు కొనసాగించారు. ఇటీవల ఆ వైద్యులను తిరిగి పంపించడంతో ఆయా విభాగాల్లో సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ట్రామాకేర్ విభాగంలో వైద్య విధాన పరిషత్‌కు చెందిన న్యూరోసర్జన్‌ను ఇటీవల తిరిగి చింతలపూడికి బదిలీ చేశారు. ఆసుపత్రిలోని 15 పడకల ట్రామాకేర్ విభాగాన్ని మూసివేశారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు వస్తే ఆ కేసులను విజయవాడ, గుంటూరుకు ఇక్కడి వైద్యులు రిఫర్ చేస్తు న్నారు. ఎన్టీఆర్ భరోసా కింద మెడికల్ బోర్డు సర్టిఫికెట్లను పొందా లంటే న్యూరోసర్జన్ సంతకం తప్పనిసరి. ఆయన లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే వారిని విజయవాడకు వెళ్ళాలని ఆసుపత్రి అధికా రులు సూచిస్తున్నారు. ఈ మేరకు నోటీసు బోర్డులోను పెట్టేశారు. ఆసుపత్రిలోని 26వ నెంబర్ ఐసీయూ విభాగంలోను సేవలు అంతంత మాత్రమే. మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.