తుఫాన్ భయం
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:43 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా వాతావరణం రెండు రోజులుగా మబ్బు లు, మేఘాలతో పొడిగా ఉండటంతో రైతుల్లో గుబులు నెలకొంది.
ఉరుకులు పరుగులతో సార్వా మాసూళ్లు
రెండు రోజులుగా మబ్బుల వాతావరణం
తుఫాన్ వెళ్లే వరకు కోతలు కోయవద్దని అధికారుల సూచన
జిల్లాలో 30 శాతానికిపైగా మాసూళ్లు
16,500 మంది లక్షా 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయం
రైతుల ఖాతాలకు రూ.250 కోట్లు జమ.. రూ.7 కోట్లు పెండింగ్
భీమవరం రూరల్/ఆచంట/తణుకు/ఉండి/పాలకొల్లు రూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా వాతావరణం రెండు రోజులుగా మబ్బు లు, మేఘాలతో పొడిగా ఉండటంతో రైతుల్లో గుబులు నెలకొంది. ఇప్పటికే అధికారులు తుఫాన్ వెళ్లే వరకు కోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. కోతలు పూర్త యిన పంటలకు సంబంధించి రైతులు తమ ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనుల్లో హడావుడిగా ఉన్నారు. దీంతో మాసూళ్లు అయిన ధాన్యం వెంటనే మిల్లులకు పంపిస్తున్నారు. వర్షాలు పడితే ఆ నారుమడులకు ఇబ్బంది ఉంటుందని రైతులు అంటు న్నారు. పొలాల వద్ద కల్లాల్లో వున్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనులలో రైతులంతా నిమగ్నమయ్యారు. రైతులంతా ఎక్కడికి వెళ్లకుండా పంటను దక్కించుకోవాలనే తపనతో ఎవరికి వారు పొలాల వద్ద కాపలా ఉంటున్నారు. వాతావరణ శాఖ సూచన లతో పండిన వరి చేలను కోయకుండా అలాగే ఉంచాలని సూచిస్తున్నారు. సార్వాలో నిలిచిన 20 వేల ఎకరాల భూమిలో నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో
కోత యంత్రాలపై ఏదీ పర్యవేక్షణ
వరి కోతలు కోసే యంత్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది గంటకు కోత కోసే యంత్రం వారు రూ.2,600 తీసుకుంటే అదే పనికి ఇప్పుడు రూ.3,000 తీసుకుంటున్నారు. సార్వా పెట్టుబడులు రైతులకు అధికమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి వాటివల్ల రైతులు నష్టపోతున్నారంటూ వారు వాపోయారు.
ఇన్‌పుట్ సబ్సిడి అందించండి
సార్వా ప్రారంభంలో నాట్లు వేసిన సమయంలో కురిసిన వర్షాలకు జిల్లాలో వరి నారుమడులు వర్షార్పణం జరిగింది. దీంతో ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడి ఇస్తామని ప్రకటించినా ఇంత వరకు అందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నారుమడులను వేసి నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కోరుతున్నారు.
ఇలా అమ్మకం.. అలా జమ
ఇలా ధాన్యం అమ్మితే.. రైతుల ఖాతాల్లో అలా డబ్బులు వచ్చి జమ అవుతున్నాయి. రైతులు సాగు మాసూళ్లు చేయడంలో ఎంత పరుగులు పెడుతున్నారో.. ధాన్యం విక్రయాల్లో అంతే స్పీడు పెంచుతున్నారు. ఒకపక్క వరి కోత యంత్రాలలో మాసూళ్లు, మరోపక్క ధాన్యం ఎండ బెట్టడంతో వెనువెంటనే అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో లక్షా 95 వేల ఎకరాల్లో సార్వా సాగు జరిగితే ఇప్పటి వరకు 30 శాతానికి పైగా సాగు మాసూళ్లయ్యింది. లక్షా 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 16 వేల 500 మంది రైతులు విక్రయించారు. దీని నిమిత్తం రూ.257 కోట్లు రైతులకు అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.250 కోట్లు రైతులు ఖాతాల్లో జమ అయ్యింది. ఇంకా రూ.7 కోట్లు మాత్రమే అందాల్సి ఉంది. ఈ ఏడాది సార్వానుంచి 4 లక్షల 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు లెక్క వేశారు. ఇప్పటి లక్షా 12 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేశారు. మిగిలిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సొమ్ము ప్రస్తుతం ఇస్తున్న విధంగా 48 గంటల్లో ఇస్తేనే రైతులందరికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని రైతులు అంటున్నారు.
దాళ్వా సాగు ఏర్పాటు
ఓ వైపు సార్వా మాసూళ్లు చేస్తూనే, వచ్చే దాళ్వా సాగు ఏర్పాటులోను రైతులు నిమగ్నమయ్యారు. సార్వా ధాన్యం సొమ్ములు వెంటనే పడుతుండటంతో దాళ్వా సాగు విత్తనాలు కొనుగోలు నారుమడి దమ్ము పనులు చేస్తున్నారు. మెట్టలో 15 వేల ఎకరాల దాళ్వా సాగుకు నారుమడులు లేకుండా జరిగింది. డెల్టాలోను వచ్చే నెల 10లోపు దాళ్వా నారుమడులు వెయ్యాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి : జేసీ
తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. పాలకొల్లు మండలంలోని పలు గ్రామాల్లో జేసీ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కళ్లాల్లోని ధాన్యాలను తడవకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. మిల్లుల వద్ద ప్రభుత్వ ప్రతిఽనిధులుగా ఉన్న కస్టోడియన్ అధికారులు మిల్లుల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ధాన్యాన్ని మిల్లులకు తరలించాని ఆదేశించారు.
24 గంటల్లోనే జమ
నాలుగు రోజులు క్రితం సార్వా పంట మాసుళ్ళు చేశారు. రెండు రోజులు ధాన్యం ఎండబెట్టి అమ్మకం చేశాం. ధాన్యం అమ్మిన 24 గంటలకు సొమ్ము ఖాతాలో పడుతున్నాయి. ఇదే తరహాలో అందరి రైతులకు చివరి వరకు సొమ్ములు అందిం చాలి. అప్పుడు రైతులకు ఎంతో సహకారం అందించినట్లు వుతుంది. ట్రాక్టర్, కూలీలు, వరికోత యంత్రాలకు త్వరితగతిన సొమ్ములు ఇవ్వగల్గుతున్నారు. గతంలో సొమ్ములు ఆలస్యంగా రావడం వలన ఎన్నో ఇబ్బందులు పడ్డాము.
– బి.బాబ్జీ, గునుపూడి, వి.పుల్లారావు, తాడేరు, రైతులు