హామీల ఉంగు'టూరు'
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:07 AM
ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం హామీలకు దిక్కులేదు. ప్రతిపక్ష హోదాలో జగన్ పాదయాత్ర నియోజకవర్గంలో హామీల టూర్‌గా సాగింది తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు.
ఆక్వా ప్రోసెసింగ్ పరిశ్రమల ఆచూకీ లేదు
తాగునీటి స్టోరేజీ హామీ ఏమైంది
శిథిల వంతెనల నిర్మాణం ఏదీ
జగనన్న కాలనీలకు దారే లేదు
ఇందిరమ్మ కాలనీల్లో సౌకర్యాలు లేవు
ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం హామీలకు దిక్కులేదు. ప్రతిపక్ష హోదాలో జగన్ పాదయాత్ర నియోజకవర్గంలో హామీల టూర్‌గా సాగింది తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు. నియోజకవర్గం భిన్నమైన భౌగోళిక స్వరూపం. మెట్టప్రాంతానికి ముఖద్వారంగా భీమడోలు ఒక వైపు.. డెల్టా ప్రాంతానికి ఆరంభం నారాయణపురం మరోవైపు. గణపవరం, నిడమర్రు మండలాలు డెల్టా, కొల్లేటి తీరానికి చేరువలో ఉంటాయి. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపు సాధిస్తే ఆ పార్టీ లేదా కూటమి అధికార పీఠం ఎక్కుతుందనే సెంటిమెంట్ కూడా ఉంది. వైసీపీ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఆక్వా రంగ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మరింత బారం మోపారు. గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించలేదు. రహదారుల అభివృద్ధి, వంతెన నిర్మాణ హామీలు అమలు చేయలేదు.
నిడమర్రు
వైసీపీ పాలన ఆక్వా రైతులకు గడ్డుకాలం. ప్రభుత్వ విధానాలతో రొయ్య, చేపల ధరలు కనిష్ఠ స్థాయి చేరాయి. రైతుకు కనీస పెట్టుబడి రాక చెరువులు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు రొయ్య పిల్ల హేచరీల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని రైతులు చెబుతున్నారు. ఆక్వా మేతల కంపెనీల నుంచి కూడా వసూళ్లతో మేత ధరలు పెంచేశారు. రైతులు నష్టాలు మూటగట్టుకుని ఆక్వా సాగుకు దూరమయ్యారు. మరోవైపు వరి రైతులు ధాన్యం అమ్ముకోడానికి నానా తిప్పలు పడుతున్నారు. అమ్మిన వెంటనే సొమ్ము అందక అప్పుల పాలవుతున్నారు. వ్యాపారాలు సన్నగిల్లాయి. ఉన్న పరి శ్రమలు మూతపడడంతో గ్రామాల్లో ఉపాధి లేక జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా జీతం ఇవ్వండి మొర్రో అని గగ్గోలు పెడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ఊసే లేదు. అధ్వాన రహదారులు, కాల్వలపై శిథిల వంతెనల నిర్మాణం గాలికొదిలేశారు. కాలనీల అభివృద్ధి పట్టించుకోలేదు. జగనన్న కాలనీల్లో రహదారులు లేవు.
ఆక్వా పరిశ్రమలు ఎక్కడ జగనన్నా
ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ 2018 మే 23న పాదయాత్ర చేస్తూ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమ బలోపేతం కోసం కోస్తా కారిడార్ వెంబడి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. తమ ప్రాంతానికి ఆయువుపట్టు అయిన ఆక్వా పరిశ్రమ అభివృద్ధితో బతుకులు బాగుపడతాయని నమ్మారు. ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రాసెసింగ్ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు.
నెరవేరని హామీలు..
2022 మే 16న గణపవరంలో సీఎం జగన్ పర్యటనలో ఎమ్యెల్యే పుప్పాల శ్రీనివాసరావు ప్రస్తావించిన సమస్యలపై పరిష్కారానికి బహిరంగ ప్రకటన చేశారే గానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
కొల్లేరు లంక గ్రామాల ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి స్టోరేజి చెరువు నిర్మిస్తామన్నారు. నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ అనుమతులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
శిథిలదశకు చేరిన నారాయణపురం, ఉంగుటూరు, పూళ్ళ, గుండుగొలను, కేశవరం వంతెనల పునర్నిర్మాణానికి హామీ ఇచ్చారు. గుండుగొలను వంతెనకు శంకుస్థాపన చేశారు. పనుల్లేవు.
విద్యుత్ డిమాండ్ తగ్గట్టుగా ఆరు సబ్ స్టేషన్‌ల నిర్మాణానికి హామీ ఇచ్చారు. రెండు పూర్తయ్యాయి. మరోటి సగంలో ఉండగా మిగతా మూడు పత్తా లేకుండా పోయాయి.
పేదలకోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో రహదారులు, డ్రెయినేజీ నిర్మాణ హామీలు అది అమలు కాలేదు. ఇందిరమ్మ కాలనీలలో తాగునీరు, డ్రైనేజి సౌకర్యం లేవు.
గణపవరంలో వెంకయ్య వయ్యేరుపై శిథిలావస్థకు చేరిన బొబ్బిలి వంతెన పుర్నిర్మాణ హామీ అమలుకు నోచుకోలేదు.
మండలంలో వ్యవసాయ, ఆక్వా చెరువలకు వెళ్లే రహదారులన్నీ ఛిద్రం కావడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పుంత రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు కార్యాచరణకు నోచుకోలేదు.
గణపవరంలో తీరని సమస్య అగ్నిమాపక కేంద్రం నిర్మాణ ం చేస్తానని ఎమ్యేల్యే పుప్పాల శ్రీనివాసరావు ఇచ్చిన హమీ నేటికి నెరవేరలేదు.
ఫత్తేపురం – తోకలపల్లి రహదారి అధ్వానం. అడవికొలను – నిడమర్రు రహదారి నిర్మాణంపై ఐదేళ్లుగా ఉలుకు పలుకు లేదు.
పెదనిండ్రకొలను పీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టకుండానే 5 ఏళ్లు గడిపోయాయి. అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఎమ్యెల్యే వాసుబాబు ఈ విషయం ప్రస్తావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
నిడమర్రులో 8 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన సమగ్ర మంచినీటి పథకం ఇంకా అసమగ్రంగా మిగిలింది.
ఉంగుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సొంత భవనం లేదు. భూమి సేకరించి భవన నిర్మాణానికి ఏడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మార్కెట్ యార్డు నిధులతో పుంత రోడ్లు నిర్మాణానికి రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
నారాయణపురం వంతెన 90 ఏళ్లక్రితం బ్రిటిష్ హయాంలో నిర్మితమైంది. శిథిల వంతెన నిర్మాణానికి రూ.8.50 కోట్ల అంచనాతో టెండర్ పిలిచిన కాంట్రాక్టర్లు మందుకు రాలేదు.
భీమడోలు మండలంలో లంక గ్రామాలకు తాగునీటి సమస్య నేటి పరిష్కారం కాలేదు
వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే పుంతరోడ్డు పరిస్ధితి, అంతర్గత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
గుండుగొలను వంతెన పనులు నత్తనడక సాగుతున్నాయి. పాతూరు, పూళ్ళ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు దశలో మిగిలిపోయాయి. భీమడోలు రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపలేదు.
ఇందిరమ్మ కాలనీ, జగన్న కాలనీలలో మౌలిక వసతులు లేవు. అప్పులుచేసి ఇళ్లు నిర్మించుకొంటే కనీసం తాగునీరు కూడా ప్రభుత్వం అందించలేకపోతోంది.