Share News

వణికిస్తున్న జ్వరాలు

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:02 AM

వైరల్‌ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మొన్నటి వరకు డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టినా వైరల్‌ ఫీవర్స్‌ వెంటాడుతున్నాయి.

వణికిస్తున్న జ్వరాలు

విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్స్‌

ఎక్కువగా టైఫాయిడ్‌ కేసులు

రోగులతో ఆసుపత్రులు కిటకిట

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 12 : వైరల్‌ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మొన్నటి వరకు డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టినా వైరల్‌ ఫీవర్స్‌ వెంటాడుతున్నాయి. ప్రతీ ఇంటిలోను జ్వర పీడితులు ఉంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న సర్వేలో కూడా జ్వరాలకు సంబంధించి పీహెచ్‌సీలో పరిధిలో 10 నుంచి 15 వరకు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఈ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

కొవిడ్‌లాగే జాగ్రత్తలు పాటించాలి

కోవిడ్‌ వచ్చినపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటివే పాటించాలని జిల్లా వైద్యాదికారులు చెబుతున్నారు. వైరల్‌ జ్వరాలు కావటంతో వాటిని అరికట్టలాంటే జాగ్రత్తలు అవసరం. జ్వరం వచ్చినవారు ఉపయోగించిన వస్తువులు వాడకపొవటం, దగ్గు, తుమ్ములు వచ్చినపుడు చేయి అడ్డుపెట్టుకోవటం, మాస్క్‌ ధరించటం, వంటివి వాడితే తొందరగా అరికట్టవచ్చనని చెబుతున్నారు. జ్వరం వచ్చినవారు బయట తిరగకుండా ఇంటి వద్దనే ఉండాలి. కాచి వడగట్టిన నీటిని తాగటం వల్ల కూడా కొంత అరికట్టవచ్చనని చెబుతున్నారు.

ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌ల తనిఖీ

ఎక్కువగా జ్వరాలు వచ్చే గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లలో నీటిని తనిఖీ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మహేశ్వరరావు తెలిపారు. నరసాపురం, పెనుమంట్ర మండలం ఆలమూరు, తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం, అత్తిలి ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయని అందువల్ల అక్కడ నీటిని పరిశీలించామన్నారు. వీరవవాసరం మడలం కొణితివాడ పీహెచ్‌ిసీ పరిధిలో ఒక వాటర్‌ ప్లాంట్‌లో ఇబ్బందులు ఉన్నటుగా నివేదిక రావడంతో ప్లాంట్‌ను మూయించి వేసినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో శుభ్రం చేసిన తరువాత నీటిని తనిఖీ చేసి పరిశుభ్రంగా ఉన్నట్లు నివేదక వస్తేనే సరఫరా చేసేందుకు అనుమతి ఇస్తామన్నారు.

ప్రజల్లో అవగాహన

వాతావరణ మార్పుల కారణంగా వైరల్‌ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటిని కాచుకుని తాగలాలని, దోమలు రాకుండా చూసుకోవాలని, జ్వరాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు. ఎక్కువగా దగ్గు, రొంప, తీవ్రమైన జ్వరం వస్తోందని, మూడు రోజుల పాటు ఉం టుందని అప్పటికీ తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

అత్తిలిలో భయాందోళన

అత్తిలి : అత్తిలిలో డెంగీ జ్వరాలతో మొన్న చిన్నారి మృతి చెందగా, నేడు 17 ఏళ్ళ యువకుడు చనిపోవడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మండలంలోని గ్రామాల్లో కూడా డెంగీ జ్వరాల ప్రభావం అధికంగా కనిపి స్తున్నది. గ్రామాల్లో జ్వరాలతో సతమతమవుతున్నారు. అత్తిలి, మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కంటే ప్రైవేటు డాక్టర్లనే ఎక్కువగా ఆశ్రయిస్తు న్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు జ్వరాలతో సతమత మవుతున్నారు. ఎక్కడ చూసినా అనారోగ్య సమస్య లతో ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రక్త పరీక్షలు చేయక పోవడం, అవగాహన కల్పించడంలో వైద్యులు విఫలమ వుతున్నారు. డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా వంటి వాటికి రక్త పరీక్షలు చేయకపోవడంతో ప్రైవేటు వైద్యు లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచు కుంటున్నారు. రకరకాల పరీక్షలు చేసి రోగులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మాత్రం నామ మాత్రంగానే ఉంది. దోమల నివారణకు గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రాలను ఉపయోగించి కట్టడి చేయాల్సి ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా మూలన చేర్చారు. మొక్కుబడిగా నీటి నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు.

పరిశీలించిన వైద్యాధికారులు

అత్తిలి మండలంలో వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. ఏ గృహాన్ని సందర్శించినా జ్వరపీడితులు ఉన్నారు. జ్వరాలకు తోడు విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రసాద్‌, జిల్లా మలేరియా అధికారి పిఎస్‌ఎస్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ మలేరియా అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో అమీలుజమా, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు, ఈవోఆర్‌డీ శ్రీనివాసరావు జ్వరాలతో మృతి చెందిన వారి ఇండ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫీవర్‌ సర్వే, యాంటి లార్వా ఆపరేషన్‌ పరిశీలించారు. హెల్త్‌ అసిస్టెంట్స్‌, గ్రామ ఆరోగ్య కార్య దర్శులు, ఆశా కార్యకర్తలు ప్రతి రోజూ ఫీవర్‌ సర్వే చేయాలన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 12:02 AM