Share News

నిమ్మల చేతికి జల వనరులు

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:29 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును జల వనరుల శాఖ మంత్రిగా నియమించారు.

నిమ్మల చేతికి జల వనరులు
పాలకొల్లు కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా వున్న తూడు, చెత్తా చెదారాన్ని రైతులతో కలిసి తొలగిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు (ఫైల్‌)

పోలవరం సహా పలు ప్రాజెక్టులకు మోక్షం

ప్రజా సమస్యల పరిష్కారంలో రామానాయుడిది ప్రత్యేక శైలి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును జల వనరుల శాఖ మంత్రిగా నియమించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధా న్యత కలిగిన శాఖ నిమ్మలకు దక్కడంతో.. ఇక ఈ రంగం లో పనులు వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గడచిన ఐదేళ్లు జగన్‌ సర్కార్‌ హయాంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్‌లన్నీ పడకేశాయి. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు. కార్యదక్షత కలిగిన నిమ్మలకు జలవనరుల శాఖ కేటాయించడంతో అందరి లోనూ ఆశలు రేకెత్తాయి. పోలవరం ప్రాజెక్ట్‌ కొలిక్కి రానుంది. కేంద్ర సహకారం అందనుంది. ఉభయ గోదావరి జిల్లాలకు రబీ స్థిరీకరణ కావాలంటే ఈ ప్రాజెక్ట్‌ ఒక్కటే మార్గం. నిమ్మలకు జలవనరుల శాఖ కేటాయించడంతో ఇది పరుగులు తీస్తుందన్న నమ్మకం ఏర్పడింది. పనులు నిర్వహించడంలో నిత్యం అధికారులు వెంటపడడం నిమ్మ ల నైజం. పని అయ్యేంత వరకు అదే ధ్యాసతో ఉంటారు. వార్తల్లోనూ నిలుస్తుంటారు. పాలకొల్లుకు శ్మశాన వాటిక నిర్మాణానికి కాంట్రాక్టరు రాకపోవడంతో అక్కడే మూడు రోజులు నిద్రించారు. అపోహలను తొలగించారు. శ్మశాన వాటిక నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఇలా పని విష యంలో పట్టుదలతో ఉంటారు. అందుకే జలవనరుల శాఖను చంద్రబాబు ఏరికోరి నిమ్మలకు కేటాయించారు.

పోలవరానికి మహర్దశ

పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే రాయలసీమ కూడా సస్య శ్యామలం కానుంది. విశాఖకు మంచినీరు అందించే అవ కాశం ఉంది. పరిశ్రమలకు ఆస్కారం ఉంటుంది. తాడి పూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు వైసీపీ ప్రభు త్వం పెండింగ్‌లో పెట్టింది. వాటికి మోక్షం లభించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. వాణిజ్య పంటలు మరింతగా విస్తరించనున్నాయి. నిమ్మలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, చింతలపూడి, తాడిపూడి ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాల్సిన బాధ్యత పడింది. అభివృద్ధి విషయంలో నిధులు రాబట్టేందుకు నిమ్మల పోరాటం చేస్తుంటారు. ఇప్పుడు పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాకు అవసర మైన ప్రాజెక్ట్‌లకు నిధులు రాబట్టడంలోనూ చొరవ చూపుతారన్న నమ్మకం జిల్లా ప్రజల్లో నెలకొంది. మరోవైపు డెల్టా ఆధునికీకరణ ముందడుగు వేయడం లేదు. కనీసం వేసవి పనులు చేపట్టడం లేదు. బిల్లులు మంజూరు చేయడం లేదు. వేసవి పనులకు దిక్కు లేకుండా పోయింది. ఇవన్నీ సక్రమంగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. జిల్లా అవసరాలను గుర్తించి డెల్టా ఆధునికీకరణకు పెద్దపీట వేయనున్నారు. వైసీపీ హయాంలో నీటి ప్రాజెక్టులకు పెద్దగా నిధులు కేటాయించలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ కనీస నిర్మాణానికి నోచుకోలేదు. గత తెలుగుదేశం హయాంలో 72 శాతం పనులు పూర్తిచేశారు. వైసీపీలో ప్రాజెక్ట్‌ను పూర్తిగా విస్మరించారు. రైతు బిడ్డగా నిమ్మల వారి కష్టాలు, సాగునీటి ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉండటంతో ఈ పదవికి పూర్తి న్యాయం జరుగుతుందని జిల్లావాసులు భావిస్తున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 12:29 AM