Share News

ఎన్నికల ఉపాధి..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:42 AM

వైసీపీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి నామినేషన్‌కు ఆ పార్టీ శ్రేణులు జనసేకరణకు కొత్త ప్రయత్నాలు చేశారు.

ఎన్నికల ఉపాధి..!
వైసీపీ అభ్యర్థి నామినేషన్‌కు తరలి వెళుతున్న ఉపాధి కూలీలు

కూలీలకు ఒకరోజు మస్తరు

వైసీపీ జనసేకరణ సిత్రం

పోలవరం, ఏప్రిల్‌ 24: వైసీపీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి నామినేషన్‌కు ఆ పార్టీ శ్రేణులు జనసేకరణకు కొత్త ప్రయత్నాలు చేశారు. పోలవరం మండలంలో ఉపాఽధి హామీ పథకం కూలీలను నామినేషన్ల కార్యక్రమానికి ఆటోలలో తరలించారు. నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చి వెళ్ళినందుకు ఒక్క రోజు పని మస్తరు వేస్తామని, రూ.300, టిఫిన్లు, టీలు, భోజనాలు ఏర్పాటు చేస్తామని ఉపాధి కూలీలను ఆటోలలో తరలించారు. ఈ తతంగంలో ఉపాఽధి హామీ పథకం మేట్లు, ఇతర ఉపాధి హామీ పథకం సిబ్బంది కూలీలను తరలించారని స్థానికులు చెబుతున్నారు. పోలవరం మండలం నుండి 50 ఆటోలు, 50 కార్లతో భారీ ర్యాలీగా నామినేషన్‌ కార్యక్రమానికి తరలి వెళ్ళారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీలకు ఆటోలకు కార్లకు తీసుకున్న అనుమతుల పరిమితి దాటి వాహనాలు పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రతి వాహనానికి జెండాలు కట్టి, వాహనాలలో పరిమితికి మించి కూలీలను తరలించారు. ఎన్నికల నిఘా బృందాలు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జనసేకరణలో గ్రామ వలంటీర్లు కూడా శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రగడవల్లి గ్రామానికి చెందిన వలంటీరు నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లేవారి వాహనాలకు దగ్గరుండి పెట్రోలు కొట్టించి పంపినట్లు స్థానికులు బాహాటంగా చెబుతున్నారు.

జనం తరలింపులో యానిమేటర్లు, ఉపాధి సిబ్బంది

ఏలూరు: అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘి స్తున్నారు. వారికి కొందరు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉంగుటూరు వైసీపీ అభ్యర్థి గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో జన సమీకరణకు డ్వాక్రా యానిమే టర్లు, ఉపాధి సిబ్బందిని వాడుతున్నారు. యానిమేటర్లపై రాజకీయ ఒత్తిడితో ఇంటింటికి పంపించి నామినేషన్‌ ర్యాలీ కోసం తరలి రావాలని చెప్పిస్తున్నారు. పెద నిండ్రకొలను, నిడమర్రు, భువ్వనపల్లి, ఛానమిల్లి, కొవ్ర్విడి, అడవికొలను, బావాయిపాలెం గ్రామాల యానిమేటర్లపై రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఉపాధి హమీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల ద్వారా ఉపాధి హమీ కూలీలకు నామినేషన్‌ ర్యాలీకి వెళ్లిన కూలీలకు ఒక రోజు మస్తరు వేస్తామని ఎర వేస్తున్నారు. డి.గోపవరం, అడవికొలను, ఛానమిల్లి, నిడమర్రు, బావాయిపాలెం, క్రొవ్విడి గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. మరో కొత్త కోణం గ్రామా లలో వలంటీర్లు తమ సెల్‌ఫోనుల ద్వారా జగనన్న కాలనీ లబ్ధిదారులకు వైసీపీ అభ్యర్ధి వాయిస్‌ రికార్డింగ్‌లు పెడుతున్నారు. వలంటీర్లతో బలవంతంగా వైసీపీ ప్రచారం చేయిస్తున్నారని పలువురు చెబుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:42 AM