Share News

క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:53 AM

క్రీడలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందవచ్చని, యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు.

క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు
ఆటల పోటీలను ప్రారంభిస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

ఈశా గ్రామోత్సవం రూరల్‌ ప్రీమియం లీగ్‌

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందవచ్చని, యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. స్థానిక డీఎన్నార్‌ కళాశాల క్రీడామైదానంలో 16వ ఈశా గ్రామోత్సవం రూరల్‌ ప్రీమియం లీగ్‌ (వాలీబాల్‌ పురుషులు, త్రోబాల్‌ స్త్రీలు)–24 శనివారం ఆయన ప్రారంభించారు. పలు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని, విజయం సాధించాలన్నారు. కళాశాల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఇటువంటి క్రీడల పోటీలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈశా ఫౌండేషన్‌ డాక్టర్‌ డి.విజయ, ఉపేంద్రవర్మ, కేపీ వర్మ మాట్లాడుతూ మొదటి లెవల్‌ (క్లస్టర్‌) మ్యాచ్‌లు రెండు రోజులు పాటు పురుషులు వాలీబాల్‌, స్త్రీలు త్రోబాల్‌ పోటీలు జరుగుతాయని తెలిపారు. వీటిలో గెలుపొందిన వారు రెండో లెవల్‌కు అర్హత సాధిస్తారని, వాటిలో గెలుపొందిన వారు డిసెంబరు 28న కోయంబత్తూరులో జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారని తెలిపారు. ఫైనల్స్‌ గెలుపొందిన వారికి రూ.5లక్షలు బహుమతి అందిస్తారన్నారు. తహసీల్దార్‌ రావి రాంబాబు, కళాశాల పాలకవర్గ సభ్యులు కె.రామకృష్ణంరాజు, బీవీ నరసింహరాజు, పీఈటీ ఉపాధ్యాయులు, 45 టీమ్స్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:53 AM