YS Jagan: ఏమైంది జగనా?
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:36 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తికమకలో పడ్డారు. మకతికగా మాట్లాడారు. ఏం చెప్పాలనుకున్నారో తెలియదుకానీ... ఏదేదో చెప్పేశారు. ‘
లాజిక్‌లు మరిచి తికమక మాటలు
దేశాన్నీ, మతాన్నీ తప్పుపడుతున్న జగన్
‘సెక్యులర్’కు తన సొంత భాష్యం
మతం అడుగుతారా అని ఆక్రోశం
ప్రార్థనా మందిరాలు ‘సెక్యులర్’ ఎలా?
గుళ్లకు వెళ్తుంటే అడ్డుకున్నది తమరు కాదా?
రాజధాని రైతులను ముప్పుతిప్పలు పెట్టలేదా?
కల్తీ నెయ్యిపైనా అదే వక్ర భాష్యం
ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదికలంటే చులకనా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తికమకలో పడ్డారు. మకతికగా మాట్లాడారు. ఏం చెప్పాలనుకున్నారో తెలియదుకానీ... ఏదేదో చెప్పేశారు. ‘ఇదేం దేశం... ఇదేం సెక్యులరిజం... ఇదేం హిందూయిజం’ అంటూ దేశాన్నీ, మతాన్నీ తప్పుపట్టారు. లడ్డూ వివాదం నేపథ్యంలో పంతం కొద్దీ తిరుమల పర్యటన పెట్టుకున్న ఆయన... దానిని రద్దు చేసుకుని శుక్రవారం తాడేపల్లి ప్యాలె్‌సలో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీతో తనకు సంబంధం లేదని చెప్పుకొంటే సరిపోయేది. కానీ... ‘కల్తీ’ని సమర్థించుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. పైగా... సున్నితమైన మత సంప్రదాయాలు, ఆలయ నిబంధనలను తప్పుపట్టేలా మాట్లాడారు. ‘‘దేవాలయాలకు వెళ్లే వాళ్లను మతం అడగడమా? మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నాం? ఇదేం హిందుత్వం? ఇదేం సెక్యులరిజం?’’ అని గద్దించారు. రాజ్యాంగం ప్రకారం భారత్ సెక్యులర్! అంటే... లౌకిక దేశం! ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. ఇది నిర్వివాదాంశం. కానీ... ప్రార్థనామందిరాలు ‘సెక్యులర్’ కాదు! అవి కచ్చితంగా మతపరమైనవే.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో తెలియడంలేదు. హిందూ ఆలయాలు, సిక్కు, జైనుల మందిరాలు, ముస్లింల మసీదులు, క్రైస్తవుల చర్చిలు... ఇవన్నీ మతపరంగానే ఉంటాయి. ఏ మతస్తులు ఆ మత ఆచారాల ప్రకారం తమ ప్రార్థనా మందిరాలను సందర్శిస్తారు. వారి వారి ఆచారాల ప్రకారం ప్రార్థనలు చేసుకుంటారు. కొన్ని హిందూ ఆలయాల్లో ప్రవేశించాలంటే పురుషులు చొక్కా విప్పాలి. తిరుమలలో సేవలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తులు ధరించాలి. మసీదుల్లో ఒక దశ దాటి మహిళలకు ప్రవేశం ఉండదు. గురుద్వారాలోకి వెళ్లే వారు తలపై వస్త్రం కప్పుకోవాలి. ఇలా... ప్రతి మతానికీ, కొన్ని ప్రార్థనా మందిరాలకూ నిర్దిష్టంగా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ మరచిపోయి... ‘సెక్యులర్ అంటే అర్థం ఏమిటి? మనం ఎలాంటి దేశంలో ఉంటున్నాం? దేవాలయానికి వెళితే మతం అడుగుతారా?’ అని జగన్ వాపోవడమే ఓ విచిత్రం! ఇతర మతస్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వెంకటేశ్వరుడిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఎన్నో దశాబ్దాలుగా ఉన్న నిబంధన! దీనిపై అభ్యంతరం ఉంటే... తాను అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఈ నిబంధనను ఎత్తేయవచ్చు కదా!?
మీది దానవత్వం కాదా?
‘దేవాలయాలకు వెళ్లే వారిని అడ్డుకోవడం మానవత్వమా?’ అని జగన్ తనదైన శైలిలో వాపోయారు. జగన్ తిరుమలకు వెళ్లకుండా ఎవ్వరూ అడ్డుకోలేదు. బహుశా డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టంలేక... ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే... జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కనక దుర్గ అమ్మవారికి సారె ఇవ్వడానికి వెళ్లిన రాజధాని మహిళలను పోలీస్ లాఠీలతో కొట్టించారు. రాజధాని రైతుల తిరుమల పాద యాత్రకు అడ్డంకులు సృష్టించారు. అరసవెల్లికి వెళ్లకుండా వెనుదిరిగేలా చేశారు. మరి... ఇప్పుడు వల్లెవేస్తున్న మానవత్వపు ముచ్చట అప్పుడేమైందో?
కల్తీ కాలేదా? నవ్విపోదురుగాక!
జగన్మోహన్ రెడ్డి తన ‘సూక్తిముక్తావళి’లో ఇంకా అనేకానేకమైన విన్యాసాలు ప్రదర్శించారు. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్‌లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ కావడం నిజం! దీనిని పక్కన పెట్టేసి... ‘అసలు ట్యాంకర్లల్లో నెయ్యిని వాడనప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని, కొవ్వు కలిసిన లడ్డూలు భక్తులకు అందించారని చంద్రబాబు ఎలా ఆరోపిస్తారు?’’ అని జగన్ ప్రశ్నించారు. అసలు వాస్తవాలను మరుగున పరిచి అసత్యాలను ప్రచారంలోకి తేవడానికి నానా తంటాలు పడ్డారు. నిజానికి... తిరుమలలో జరిగింది వేరు. టీటీడీకి ఐదు కంపెనీల నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. అందులో దుండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీ ఒకటి. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదులపై ఇప్పుడు టీటీడీ దృష్టి సారించింది. సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిలో కల్తీని పరీక్షించే పూర్తిస్థాయి ల్యాబ్ టీటీడీలో లేదు. ఒక దశ వరకు మాత్రమే నాణ్యతను నిర్ధారించవచ్చు. అలా ఐదు కంపెనీల నుంచి వచ్చిన నెయ్యి క్వాలిటీ టెస్ట్ చేసి లడ్డూల తయారీకి వినియోగించారు. ఆ తర్వాత బ్యాచ్‌లో వచ్చిన నెయ్యిని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీలో పరీక్షించారు. అక్కడ... ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టులో రావడంతో జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకర్లను టీటీడీ అధికారులు వెనక్కి పంపించారు. ఇదీ అక్కడ జరిగింది. ‘అసలు ఆ నెయ్యి వాడలేదు కదా’ అని జగన్ చెబుతున్నది దీని గురించే. అంతకుముందు జరిగిన సరఫరా గురించి మాత్రం ఆయన తెలివిగా దాటవేస్తున్నారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న నేషనల్ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ల్యాబరేటరీ నివేదికను కూడా జగన్ తప్పు పడుతుండటం గమనార్హం. అది జాతీయ స్థాయి సంస్థ. జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కూడా దీన్ని రిఫరల్ ల్యాబరేటరీగా ఉపయోగిస్తుంది. అంతటి ప్రాధాన్యంఉన్న సంస్థను కూడా జగన్ తన మీడియా సమావేశంలో తేలిగ్గా తీసిపడేశారు. అసలు ఆ రిపోర్టును నమ్మాల్సిన అవసరం లేదన్న విధంగా చెప్పుకొచ్చారు.
డిస్‌క్లైమర్ గొడవ ఏమిటి.?
ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో ఉండాల్సిన ప్రమాణాలు సరిగ్గా లేవని చెబుతూ, డిస్‌క్లైమర్ పెట్టారని జగన్ సూత్రీకరించారు. బహుశా ఆయన ఉద్దేశం అది కల్తీ నెయ్యి కాదు.. ఆవులు అనారోగ్యంతో ఉన్నా అలాంటి ఫలితం రావచ్చునని, దానిని కల్తీ అనలేమని కావొచ్చు. జగన్ ఇక్కడే లోకజ్ఞానాన్ని మరిచిపోయారు. ఏ పరీక్ష నివేదికలోనైనా ‘డిస్‌క్లైమర్’ ఉంటుంది. ఏ ల్యాబరేటరీ అయినా శాంపిల్ తీసిన సమయాన్ని తాను పరీక్షించిన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుట్ నోట్ ఇస్తుంది. ప్రతి ల్యాబరేటరీ లెటర్ హెడ్‌లో ముందే ‘డిస్‌క్లైమర్’ను ముద్రిస్తారు. మనం చేయించుకునే రక్త పరీక్షలు, ఇతర రిపోర్టుల్లోనూ దీనిని గమనించవచ్చు. అంతమాత్రాన... ఆ నివేదికలోని అంశాలు తప్పు అని కాదు. ఆ నివేదిక పనికి రాదనికాదు. ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికలోని డిస్‌క్లైమర్ కూడా ఇలాంటిదే! దీనిని చూపించి... ఎన్‌డీడీబీ కూడా గట్టిగా కల్తీ అని నిర్ధారించలేదని జగన్ వితండవాదం చేస్తున్నారు.
Also Read:
కర్ణాటక సీఎంపై లోకాయుక్తలో కేసు
For More Andhra Pradesh News and Telugu News..