అలాంటి పోస్టులుపెడితే అరెస్ట్ చేయరా?
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:47 AM
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని, తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న ఓ వ్యక్తి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించలేం: హైకోర్టు
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని, తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న ఓ వ్యక్తి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎదుటివాళ్లను బాధించే పోస్టులు పెడితే అరెస్టు చేయరా అని ప్రశ్నించింది. పిటిషన్‌పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లిఖార్జునరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్యకరపోస్టులు పెట్టాననే ఆరోపణతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన గొర్లి సత్య నీరజ్‌కుమార్ నాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది టీఎంకే చైతన్య స్పందించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.