అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు
ABN , Publish Date - Sep 13 , 2024 | 03:56 AM
రాజధాని అమరావతిలో వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవల్‌పమెంట్ బ్యాంకు (ఏడీబీ) బృందాలు గురువారం పర్యటించాయి.
టిడ్కో ఇళ్లు, కొండవీటివాగు పరిశీలన
తుళ్లూరు, సెప్టెంబరు 12: రాజధాని అమరావతిలో వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవల్‌పమెంట్ బ్యాంకు (ఏడీబీ) బృందాలు గురువారం పర్యటించాయి. ముందుగా తుళ్లూరులోని టిడ్కో ఇళ్ల సముదాయాలను పరిశీలించాయి. అనంతరం వారు మందడంలో డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. వారి జీవన ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటపాలెంలో రైతులతో సంభాషించారు. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి తెలియజేశారు. అమరావతిలో వరద ప్రభావం ఎప్పుడూ లేదని.. మొన్న వచ్చిన వరద కూడా రాజధానిని తాకలేదని రైతులు వివరించారు. వందేళ్లలో ఈ ప్రాంతం ఎప్పుడూ వరద కారణంగా ఇబ్బంది పడింది లేదన్నారు. రాయపూడి రెవెన్యూలో నిర్మించిన ఎమ్మెల్యే భవనాలను బృందాలు పరిశీలించాయి. తర్వాత ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని చూశారు.