Share News

AP Election Results: ఆంధ్రా ఓటరు దెబ్బ.. జగన్‌ మైండ్ బ్లాక్ !

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:07 PM

ఎన్నికల పలితాల్లో ఆంధ్రా ఓటరు.. తన ఓటుతో కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మైండ్ బ్లాక్ అయి.. గ్రీన్ అయి.. రెడ్ అయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్కొంటున్నారు.

AP Election Results: ఆంధ్రా ఓటరు దెబ్బ..  జగన్‌ మైండ్ బ్లాక్ !

ఎన్నికల పలితాల్లో ఆంధ్రా ఓటరు.. తన ఓటుతో కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మైండ్ బ్లాక్ అయి.. గ్రీన్ అయి.. రెడ్ అయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్కొంటున్నారు. తాను తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలే తమను వరుసగా రెండోసారి అందలం ఎక్కిస్తాయని ఆయన మనసా.. వాచా.. కర్మణా భావించారని.. కానీ తాను ఒకటి తలిస్తే ఓటరు మరొకటి తలచినట్లుగా ఎన్నికల ఫలితాల ద్వారా సుస్పష్టమైందని వారు పేర్కొంటున్నారు.


అంతేకాదు వైనాట్175 కాస్తా.. రెండంకెల ఫలితాలతో ఆయనతోపాటు ఆయన పార్టీ సైతం సరి పెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు. అధికార వైసీపీ తాజాగా ఓటమికి ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే.. ఆ ప్రభుత్వ పతనానికి కారణమైందని సోదాహరణగా వివరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే... ఆయనకు భస్మాసుర హస్తంగా మారిందని సుస్పష్టం చేస్తున్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ప్రజా వేదిక కూల్చడంతో వైయస్ జగన్ విధ్వంస పాలన మొదలైందని గుర్తు చేస్తున్నారు. అనంతరం రాజధాని అమరావతిని పక్కన పెట్టి.. మూడు రాజధానుల ప్రకటన చేయడం ద్వారా తన గొయ్యను స్వయంగా ఆయనే తవ్వుకున్నట్లుగా అయిందనే నెటిజన్లు వివరిస్తున్నారు.


ఇక సీఎం‌గా వైయస్ జగన్ బాధ్యత చేపట్టిన నాటి నుంచి ఏ రోజు ఆయన ప్రెస్‌మీట్ పెట్టిన పాపాన పోలేదని సోదాహరణగా వివరిస్తున్నారు. కనీసం ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైయస్ జగన్.. ప్రధాని మోదీతోపాటు ఆయన కేబినెట్‌ సహచరులతో సమావేశమయ్యేవారని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అనంతరం తాను రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని కలిశానంటూ.. వాటి వివరాలను ఈ ఐదేళ్లలో ఒక్క రోజు కూడా సీఎంగా వైయస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి వివరించ లేదంటున్నారు. అలాగే మూడు రాజధానుల ప్రకటన అనంతరం కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో కానీ... శాసన సభ రాజధాని అమరావతిలో కానీ.. న్యాయ రాజధాని కర్నూలులో కానీ ఒక్క ఇటుక రాయి వేసి కార్యాలయ నిర్మాణం అయితే చేపట్టలేదని నెటిజన్లు చెబుతున్నారు.


అంతేకాదు ఈ అయిదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని వైయస్ జగన్ కేబినెట్‌లోని మంత్రులను ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందో తామందరికీ తెలిసునని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ జగన్ పాలనలో రాష్ట్రంలోని పలు పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సంగతి వారు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి సైతం పూర్తి అధ్వానంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా అప్పు కోసం ప్రతీ నెల ఆర్బీఐ ఎదుట ఈ జగన్ ప్రభుత్వం చేతులు కట్టుకొని నిలబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇలా ఈ అయిదేళ్లలో జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై ఆంధ్రా ఓటరుకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అందులోభాగంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో.. రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా ఓటర్లు ఓటు వేశారనే విషయం ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల సరళిని బట్టి స్పష్టమవుతుందని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 03:08 PM