టీచర్లను వైసీపీ అవమానించింది!
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:46 AM
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. టీచర్లకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి టీచర్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం అవమానించింది.
బ్రాందీ షాపుల ముందు నిలబెట్టింది
బాత్‌రూముల ఫొటోలు తీయించింది
మేం వారి గౌరవ ప్రతిష్ఠలు పెంచుతాం
అన్ని విధాలుగా అండగా ఉంటాం
కూటమి విజయంలో వారి పాత్ర కూడా
రాష్ట్రం నాలెడ్జ్ హబ్ కావాలి
ఒకప్పుడు నేనే జనాభా నియంత్రించాలన్నా..
ఇప్పుడు జన సంఖ్య పెరగాలి: సీఎం
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. టీచర్లకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి టీచర్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం అవమానించింది. బ్రాందీ షాపుల ముందు నిలబెట్టింది. బాత్‌రూముల ఫొటోలు కూడా తీయించి మరో రకంగా అవమానించింది. టీచర్ల ప్రతిష్ఠ, గౌరవం పెంచే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వారికి సమాజంలో ఉండే గౌరవం కొనసాగేలా చూస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం వాస్తవానికి సెప్టెంబరు 5నే జరగాల్సి ఉన్నా విజయవాడ వరదల కారణంగా వాయిదా పడిందన్నారు. దేశంలో ఐఐటీల వ్యవస్థకు నాంది పలికిన వ్యక్తి దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని తెలిపారు.
ఆంగ్ల భాష మన విద్యార్థులకు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని, అలాగని మాతృభాష తెలుగును విస్మరిస్తే జాతి మనుగడ కష్టమవుతుందని చెప్పారు. అందువల్ల రెండు భాషలను సమతుల్యం చేసుకోవాలన్నారు. ఇక్కడ సాధారణ బడుల్లో చదివి నేడు అమెరికాలో అమెరికన్ల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు ఉన్నారంటే.. అందుకు గురువులే కారణమని చెప్పారు. టీడీపీ కూటమి 93 శాతం సీట్లతో విజయం సాధించిందంటే అందులో వారి పాత్ర కూడా ఉందన్నారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం మొత్తంగా 11 డీఎస్సీలు ఇచ్చింది. వాటిలో ఎనిమిదింటిని నేను సీఎంగా ఉండగా ఇచ్చాను. ఇప్పుడు నాలుగోసారి సీఎం అయ్యాక తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టా. ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు సిగరెట్ ప్యాకెట్లపై టీచర్ల బదిలీలకు సిఫారసు చీటీలు రాసేవారు. ఆ అవమానాలు ఉండకూడదనే కౌన్సెలింగ్ విధానం ప్రవేశపెట్టాం. టీచర్లకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. భావి తరాలను వారు ఉన్నతంగా తీర్చిదిద్దాలి. వారు కూడా నిత్యం విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను రిక్షావాలా చెప్పినా దానిని ఎలా అమలుచేయాలనే కోణంలో ఆలోచిస్తూ నిత్య విద్యార్థిగా ఉంటాను’ అని తెలిపారు.
..అందుకే చాగంటి నియామకం
భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప కుటుంబ వ్యవస్థ ఉందని చంద్రబాబు అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందుకు భిన్నం గా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ సంస్కృతిని తొలగించి మంచి విలువలు పెంచేందుకే ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించామని తెలిపారు. వచ్చే నాలుగైదేళ్లలో ఏపీ నాలెడ్జ్ హబ్‌గా మారాలన్నారు. నాలెడ్జ్ ఆధారిత ఎకానమీ పెరగాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. అమరావతి, తిరుపతి, విశాఖలను విజ్ఞాన కేంద్రాలుగా తయారుచేస్తామన్నారు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే గొప్ప జాతిగా ఎదగాలనేది లక్ష్యమని చెప్పా రు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విచ్ఛి న్నం చేసిందని విమర్శించారు. రూ.1.35 లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా ఆపేసిందన్నారు.
జనాభా పెంపుపై నవ్వులు
‘ఒకప్పుడు నేనే జనాభా నియంత్రణ అవసరమని ప్రచారం చేశాను. ఇప్పుడు అనేక దేశాలు, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతోంది. మానవ వనరుల అవసరం చాలా ఉంది. అందుకు తగ్గట్టుగా జనాభా పెరగాలి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు 12 మంది పిల్లలున్నారు. ఆయన కూడా పిల్లలను కనాలని ప్రచారం చేస్తున్నాడు. ఒకప్పుడు ఇద్దరికి మించి పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చట్టం చేశాం. ఇప్పుడు ముగ్గురు ఉం టేనే పోటీకి అర్హులని నిబంధనలు తేవాలేమో’ అని సీఎం అనగానే సభలో నవ్వులు పూశా యి. ఒకప్పుడు ఎయిడ్స్‌పై అవగాహన కోసం బ్రేక్ సైలెన్స్ అనేవాళ్లమని, ఇప్పుడు జనాభా పెంపుపై టీచర్లు సైలెన్స్ బ్రేక్ చేసి సమాజంలో అవగాహన కల్పించాలని పిలుపిచ్చారు.
164 మందికి అవార్డులు..
రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డులు 164 మందికి దక్కాయి. వారిలో పాఠశాల విద్య టీచర్లు 68 మంది, జూనియల్ లెక్చరర్లు 25 మంది, ఉన్నత విద్యలో 55 మంది లెక్చరర్లు, సాంకేతిక విద్య లెక్చరర్లు 16 మంది ఉన్నారు. వీరితో పాటు ఈ ఏడాది రాష్ట్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఇద్దరికి కూడా అవార్డులు అందజేశారు. అవార్డు కింద రూ.20 వేల చెక్, మెడల్, ప్రశంసాపత్రం ఇచ్చారు.
నా నెత్తిన 6,500 కోట్ల అప్పు పెట్టారు
టీచర్లు తలచుకుంటే ప్రైవేటు బడులు క్లోజ్: లోకేశ్
మాజీ సీఎం జగన్ రాత్రిపూట ఆత్మల తో మాట్లాడి, తెల్లవారగానే అనాలోచిత నిర్ణయాలు తీసుకునేవారని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రధాన సభలో ఆయన మా ట్లాడుతూ.. ‘నేను కూడా సీబీఎ్‌సఈ విద్యార్థినే. పరీక్షలు వస్తున్నాయంటే మా అమ్మ ఎక్కువ భయపడేది. ఇక్కడ కూడా సీబీఎ్‌సఈపై అంచనా కోసం పరీక్షలు నిర్వహిస్తే 90శాతానికి పైగా విద్యార్థులు ఫెయిలయ్యారు. టోఫెల్, ఐబీ అంటూ ఆచరణ సాధ్యంకాని సంస్కరణలు ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు వృథా చేశారు. చివరకు నా నెత్తిన రూ.6500 కోట్ల అప్పులు పెట్టి వెళ్లారు’ అని వ్యాఖ్యానించారు. మొదట తాను విద్యాశాఖ తీసుకున్నప్పుడు, ఇందులో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని శాఖ మార్చుకోవాలని చాలా మంది సలహాలిచ్చారని, కానీ సవాల్‌గా భావించి దీనిని తీసుకున్నానని చెప్పారు. ఐదేళ్లలో ఏపీ విద్యా విధానం అంటే ఇదీ అనుకునేలా మారుస్తామన్నారు. ‘నా బలం, బలగం టీచర్లే. వారు తలచుకుంటే ప్రైవే టు బడులు మూతపడిపోతాయి. శనివారం నో బ్యాగ్ డేగా ఉంచాలని నిర్ణయించాం’ అని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.