బూతులే సిగ్గుపడేలా!
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:27 AM
బూతు’ అనే మాట చాలా తక్కువ! అవి... బూతులే సిగ్గుపడి చచ్చేంత బూతులు! నడివీధిలో కొట్టుకునే వాళ్లు కూడా నోరెత్తి పలికేందుకు వెనుకాడే బూతులు!
వైసీపీ సోషల్ సైకో ఫ్యాక్టరీ దారుణాలు
ఎవరిని ఎలా తిట్టాలో పైనుంచి ఆదేశాలు
వర్రా ‘సోషల్ పోస్టులు’ నీచం, దారుణం
గిట్టని వారిపై రాక్షసంగా విరుచుకుపడటమే
తల్లి, చెల్లి, పుట్టుకలపై జుగుప్సాకర వ్యాఖ్యలు
వయసు, వావీ వరస తేడాల్లేకుండా పోస్టులు
మనస్సాక్షి అనేది ఉంటే.. జగనే వారించే వారు
సోషల్ సైకోల కూపీ లాగుతున్న పోలీసులు
‘ప్రశ్నించే వారిపై దాడి’ అని వాపోతున్న జగన్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘బూతు’ అనే మాట చాలా తక్కువ! అవి... బూతులే సిగ్గుపడి చచ్చేంత బూతులు! నడివీధిలో కొట్టుకునే వాళ్లు కూడా నోరెత్తి పలికేందుకు వెనుకాడే బూతులు! ‘ఇలా అన్నాడు’ అని మరొకరితో చెప్పలేని, అక్షరాల్లో రాయలేని స్థాయి బూతులు! వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా మనస్సాక్షి ఉంటే... ‘ఇంతటి బూతులు తిట్టిన వాళ్లను వదలొద్దు’ అని ఆయనే చెప్పేవారు. ‘ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా?’ అని వాపోవడం ఆపేస్తారు! ‘‘అన్నం తినేవాళ్లెవరూ ఆ బూతులు వాడరు. వాటిని చదవాలంటేనే నాకు సభ్యత, సంస్కారం అడ్డొస్తున్నాయి’’ అని ఇటీవల కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారంటే వాటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో వాడిన 40కి పైగా బూతు వ్యాఖ్యల స్ర్కీన్ షాట్లను కూడా పోలీసులు సాక్ష్యాలుగా సేకరించారు. వాటిని చూస్తే ‘ఇంత నీచమా’ అని ఎవరికైనా అనిపిస్తుంది. బాధితుల్లో సున్నితమైన మనస్కులు వీటిని చూసి కుంగిపోవడం, క్షోభకు గురి కావడం ఖాయం. గిట్టని పార్టీల నాయకులను మాత్రమే కాదు... సోషల్ మీడియాలో వైసీపీ సర్కారును ప్రశ్నించిన సామాన్యులపైనా పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు.
ఆర్గనైజ్డ్‌గా ‘బూతుల ఫ్యాక్టరీ’
వైసీపీ ‘సోషల్ మీడియా సైకో’ ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతుంది. ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎవరిని ఎలా తిట్టాలి, సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టాలి, ప్రెస్‌మీట్లలో ఎలా తిట్టాలి... ఇలా ఎప్పటికప్పుడు ‘పైనుంచి’ ఆదేశాలు, సూచనలు వెళతాయి. పోస్టులు పెట్టేవారిలోనూ స్థాయిలు ఉంటాయి. వేలకొద్దీ ఫేక్ ఐడీలను సృష్టించి... వాటి ద్వారా విచ్చలవిడిగా పోస్టులు పెడతారు. పెద్ద సైకోలు, పిల్ల సైకోలు, ఇంకా కింది స్థాయి వారూ... ఇలా కేటగిరీల వారీగా బాధ్యతలు అప్పగిస్తారు. శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి, వర్రా రవీంద్రా రెడ్డి, ఇంకా రకరకాల పేర్లతో తయారైన అకౌంట్లన్నీ ఇందులో భాగమే. ఇక... వర్రా రవీంద్రా రెడ్డి పోస్టులు మరీ నీచంగా, దారుణంగా ఉంటాయి.
విభేదిస్తే బూతుల దాడి...
చేసిన మంచి చెప్పుకోవడం, విమర్శలకు బదులివ్వడం ఒక పద్ధతి. కానీ... బూతులతో దండెత్తడమే వర్రాకు తెలిసిన పాడు పద్ధతి! తమకు గిట్టని వారి పుట్టుకలనూ, తల్లులనూ అవమానించడం అతడికి సర్వసాధారణం! ‘వాడు, వీడు, ...కొడుకు’ వంటి పదాలను అలవోకగా వాడేస్తాడు. వావి వరుసలూ పట్టించుకోడు. సమాజంలో ఎవరూ ఇంత యథేచ్చగా బూతులు వాడలేరు, వాడరు, వాడలేదు! అలాంటి బూతులను ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేయడమే బరితెగింపు! చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లతోపాటు వారి కుటుంబ సభ్యులపైనా అతను నీచాతి నీచమైన, జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వైసీపీతో విభేదించి బయటికి వచ్చినా బూతులే! ప్రతి చోటా కులం ప్రస్తావన తీసుకొస్తాడు. ఆయా కులాల పేర్లు ప్రస్తావించి మరీ... ‘వీళ్లింతే. వీళ్లను నమ్మొద్దు’ అని తిడతాడు. ఉదాహరణకు... సినీ నటుడు పృథ్వీ బయటికి రాగానే, ఆయనను, ఆయన కులాన్నీ కలిపి బూతులు తిట్టాడు. వైసీపీలోనూ ఆయా కులాల వారున్నారన్నది మరిచిపోయాడా? తమ కులాన్ని తిడుతున్నా ఆయా నేతలు ఎందుకు ఊరుకున్నారు? జగన్ దృష్టికి తీసుకురాలేదా? అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు.
షర్మిలపై నీచాతి నీచంగా..
జగన్ సోదరి షర్మిలను ఉద్దేశించి వర్రా రవీంద్రా రెడ్డి వాడిన బూతులు అన్నీ ఇన్నీ కావు. ‘‘జగన్మోహన్ రెడ్డి రెడ్డి కుటుంబంలో పుట్టాడు. రెడ్డి అయ్యాడు. మరి నువ్వు ఎవరు. శాస్త్రి కుటుంబంలో పుట్టి బాప్టిజం తీసుకున్న ఇంటికి కోడలిగా వెళ్లావు. మరి నువ్వు షర్మిల శాస్త్రివా... షర్మిల మేరీ మాతవా?’’ అనేది అందులో ఒక పోస్టు! మిగిలిన వాటితో పోల్చితే అతి తక్కువ బూతు ఉన్నది ఇదొక్కటే. మిగిలినవి మరీ దారుణం, నీచం! వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మీదా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అప్పట్లో వర్రా బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో అతను ఎప్పటికప్పుడు మరింత రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా తగ్గలేదు. అదే స్థాయిలో బూతులు కొనసాగించాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆక్రోశం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో... ఇప్పుడు పోలీసులు జూలు విదిలిస్తున్నారు. ‘సోషల్ సైకో’లను వెంటాడుతున్నారు. వాళ్ల బూతులు, నీచ వ్యాఖ్యలను యథేచ్ఛగా ప్రోత్సహించిన వైసీపీ పెద్దలు... ఇప్పుడు ‘ప్రశ్నించే వారికి సంకెళ్లు... ఉక్కుపాదం... పోలీసుల అరాచకం’ అని వాపోతుండటం గమనార్హం. వైసీపీ సోషల్ మీడియా వ్యూహంలో బూతులు ఒక కోణం మాత్రమే! తప్పుడు వార్తలు సృష్టించడం, ఫొటోలు మార్ఫింగ్ చేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టడం... ఇలాంటివి మరెన్నో ఉన్నాయి! చంపేస్తాం, నరికేస్తాం... అనే హెచ్చరికలూ చేశారు. ఇదంతా ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’లా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.