మా ప్రభుత్వంలో ప్రతిభతో ఆర్థిక వ్యవహారాలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:23 AM
తమ ప్రభుత్వంలో ప్రతిభతో ఆర్థిక వ్యవహారాలను నిర్వహించామని, తమను పిలిచి అవార్డు ఇవ్వాలని మాజీ సీఎం జగన్ అన్నారు.
అప్పులపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేసింది: జగన్
అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వంలో ప్రతిభతో ఆర్థిక వ్యవహారాలను నిర్వహించామని, తమను పిలిచి అవార్డు ఇవ్వాలని మాజీ సీఎం జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పురత్న బిరుదు ఇవ్వాలన్నారు. తమ ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందించకూడదని, ఆర్థిక సంస్థలేవీ అప్పులు ఇవ్వడానికి వీల్లేకుండా చేయడానికి అప్పట్లో చంద్రబాబు అండ్ కో ఆర్గనెజ్డ్ క్రైమ్ చేసిందని ఆరోపించారు. 2022 ఏప్రిల్ 5వ తేదీన 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం ప్రారంభించి, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు ఏకంగా రూ.14 లక్షల కోట్లకు తీసుకువెళ్లారన్నారు. తమ ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదని, కేంద్రం నిధులు ఇవ్వకూడదన్న రాజకీయ కుట్రతోనే ఇదంతా చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జూలైలో ఆర్థిక శాఖ సమీక్షలోనూ రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ చెప్పారని అన్నారు. జూలై 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు చేశారంటూ గవర్నర్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.