నా తల్లి,చెల్లి పేరుతో రాజకీయాలు
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:05 AM
తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబుకూ కుటుంబం ఉంది
తన తల్లిదండ్రులకు తిండి పెట్టారా?
వారికి ఆయన తలకొరివి పెట్టారా?
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా?
కుటుంబంలో విభేదాలు నిజమే
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కుటుంబంలో విబేధాలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అదే సమయంలో... చంద్రబాబుకు కూడా కుటుంబం ఉంది కాదా అని జగన్ ప్రశ్నించారు. బుధవారమిక్కడ తాడేపల్లి ప్యాలెస్‌లో తన సానుకూల మీడియాను పిలిపించుకుని మాట్లాడారు. ‘‘పదేపదే షర్మిల పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? గతంలో షర్మిలపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రపంచానికి చూపించారా...వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా... తలకొరివి పెట్టారా’ అని ప్రశ్నించారు. దళిత మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై కేసులు మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ తప్పుడు కేసు పెట్టారని, ఆ సమయంలో ఆయన అసలు ఊళ్లోనే లేరన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా 8 కేసులు పెట్టారని పేర్కొన్నారు. ‘సోషల్‌మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాలను సృష్టిస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యలను, అసభ్యకర పోస్టులను పెడుతున్నారు. వారే తిడతారు. తిరిగి వారే కేసులు పెడతారు’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘‘రిటైర్డ్ పోలీసు అధికారులు... ఆర్పీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్‌తో ఒక జట్టును సీఎం చంద్రబాబు ఏర్పాటుచేశారు. ఈ ముగ్గురూ....మాట వినని అధికారులు, వైసీపీ నేతల సమాచారం జిల్లాల్లోని టీడీపీ నేతల నుంచి తీసుకుంటున్నారు. వారిపై కక్షసాధింపునకు ఆ సమాచారం వాడుకుంటున్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి .. ముఖానికి మాస్కులు వేసి .. కొడుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ తీసిన వీడియోలు ప్రభుత్వ పెద్దలకు పంపుతున్నారు. ఈ వీడియోలను వారు సంతోషంగా చూస్తూ, తమ శాడిజం బయటపెట్టుకుంటున్నారు’’ అని జగన్ విమర్శించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై తప్పుడు కేసు పెట్టడం అక్రమమన్నారు.మరో పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముక్తసరిగా స్పందిస్తూ... ‘‘ప్రజలు ఆదరించినంత కాలమే ముఖ్యమంత్రిగా ఉంటారు’’ అని సమాధానం ఇచ్చారు.
ఆయన.. ఓ బొంకుల బాబు
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను నెరవేర్చలేక రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సీఎం చంద్రబాబు రోజుకు ఒక అబద్ధం చెబుతున్నారనీ, ఆయనను బొంకులబాబు అని ఎందుకనకూడదని జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ. ఆరులక్షల కోట్లు. కానీ రూ.14 లక్షల కోట్లంటూ అబద్ధాన్ని బాబు ప్రచారం చేస్తున్నారు’’ అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి బాదుడే బాదుడు తిరిగి మొదలైందనీ, ప్రజలపై రూ.18వేల కోట్ల విద్యుత్ భారం వేసిందని విమర్శించారు.
బొంకులెవరివి జగన్ ?
జగన్ మాట్లాడే ప్రతి మాటా తనను తాను అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటోందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవరివి బొంకులని ప్రశ్నిస్తున్నాయి. ఈ వర్గాల వాదన ప్రకారం.. వలంటీర్లకు ఈ ఏడాది జూన్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, వైీపీపీ హయాంలోనే వారిని తొలగించారని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారని జగన్ తెలిపారు. అయితే ఆ చర్చ జరిగింది మండలిలో.. జవాబిచ్చింది బాబు కాదు.. మంత్రి స్వామి. కూటమి సర్కారు ఏర్పడి ఆరు నెలలవుతున్నా.. ఉద్యోగ నియామకాలు జరపలేదని జగన్ విమర్శించారు. 2019 ప్రచారంలో తాను వస్తే జనవరి 1నే జాబ్ క్యాలెంటర్ విడుదల చేస్తానని చేయలేదు. తాను ఉన్నప్పుడు పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని జగన్ ప్రకటించారు. అయితే, ఐదేళ్లలో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయో .. ఎంఎ్‌సఎంఈలు ఎన్ని వచ్చాయో ఆయనే చెప్పలేకపోయారు. మాట్లాడిన మాటలన్నీ బొంకులేనని రాజకీయవర్గాలు తేల్చేస్తున్నాయి.