YS Sharmila : జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికొదిలారు
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:21 AM
మాజీ సీఎం జగన్ హయాంలో ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
డ్యామ్‌లు కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు.. షర్మిల ధ్వజం
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
పెద్దాపురం, సెప్టెంబరు 12: మాజీ సీఎం జగన్ హయాంలో ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలేరు ఆధునీకరణపై జగన్ దృష్టి సారించలేదని, ఆ నిర్లక్ష్యమే ఏలేరు వరద రైతులను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో రూ.135 కోట్లు సైతం విడుదల చేసి ఏలేరు ఆధునీకరణ పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. జగన్ హయాంలో డ్యామ్‌లు కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ గతంలో రూ.4వేలు పరిహారం ఇచ్చి రైతులను మోసగించారని, అదే మోసం మళ్లీ చంద్రబాబు చేయవద్దని కోరారు. రాష్ట్రంలో 6లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా తక్షణమే ఏలేరు ఆధునీకరణ పనులు మొదలుపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.