YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:28 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.
అదానీ నుంచి రూ.1,750 కోట్లు ముడుపులు తీసుకున్నారు
విద్యుత్తు ఒప్పందాన్ని రద్దు చేయాలి
పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ బయటకు రాలేడు: షర్మిల
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. అదానీ నుంచి ఆయన తీసుకున్న ముడుపుల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అదానీతో డీల్ రద్దు చేయడానికి సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ‘అదానీ’తో జగన్ సర్కారు చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఈఆర్‌సీకి లేఖ రాశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నారు. ఈ అంశంపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అదానీ పేరును చంద్రబాబు ఎత్తడమే లేదు. తన పేరెక్కడుందని ప్రశ్నిస్తున్న జగన్‌కు.. అప్పటి సీఎం తానేనని తెలియదా? రాష్ట్రానికి 25 ఏళ్ల పాటు అదానీ పవర్ భారమే.
పక్క రాష్ట్రాల్లో యూనిట్ రూ. 1.99కు అమ్ముతుంటే.. ఏపీలో 50 పైసలు ఎక్కువగా రూ. 2.49కు ఎందుకు కొన్నారు? జగన్ అధికారంలోనికి వచ్చిన వెంటనే చంద్రబాబు చేసిన ఒప్పందాలను రద్దు చేశారు. లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉండకూడదని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్.. అధికారంలోనికి వచ్చాక సెకీతో 25 ఏళ్లకు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. పచ్చ కామెర్లు వచ్చిన వాడిలా బొత్స తీరు ఉంది. నేను వ్యక్తిగత అంశాలు మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేడు. జగన్ నిర్లక్ష్యాన్ని, అవినీతిని మాత్రమే నేను ప్రశ్నించాను. అదానీ నుంచి ముడుపుల సంగతి అడిగితే, వివేకా హత్య గురించి మాట్లాడితే, గంగవరం పోర్టును ఎందుకమ్మేశారని ప్రశ్నిస్తే పర్సనల్ అవుతుందా? జగన్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు. కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలు అయింది. సూపర్ సిక్స్ ఎక్కడ’’ అని షర్మిల ప్రశ్నించారు.