Share News

AP Election 2024: మా అడ్డాకి ఎవడు పంపించాడ్రా!

ABN , Publish Date - Apr 10 , 2024 | 08:20 AM

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చెందిన ఎన్నికల ప్రచార వాహనంపై రెంటచింతలలో మంగళవారం రాత్రి దాడి చేశారు. ‘‘మా అడ్డా(గ్రామానికి)కు ఎవడు పంపించాడ్రా!’’ అంటూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనంపై కర్రలు, రాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. హడలిపోయిన వాహనం డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతానని కాళ్లవేళ్లా పడినా వినకుండా పిడిగుద్దులు కురిపించారు.

AP Election 2024: మా అడ్డాకి ఎవడు పంపించాడ్రా!

● టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రచార వాహనంపై మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ గూండాలు

● రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనంపై కర్రలు, రాళ్లతో దాడి.. ఫ్లెక్సీలు ధ్వంసం

● డ్రైవర్‌ వేడుకున్నా వదలకుండా పిడిగుద్దులు

● పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు


గుంటూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చెందిన ఎన్నికల ప్రచార వాహనంపై రెంటచింతలలో మంగళవారం రాత్రి దాడి చేశారు. ‘‘మా అడ్డా(గ్రామానికి)కు ఎవడు పంపించాడ్రా!’’ అంటూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనంపై కర్రలు, రాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. హడలిపోయిన వాహనం డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతానని కాళ్లవేళ్లా పడినా వినకుండా పిడిగుద్దులు కురిపించారు. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టారు. ప్రచార వాహనం ఎల్‌ఈడీ స్క్రీన్‌ని తునాతునకలు చేశారు. సౌండ్‌బాక్సులను పగలగొట్టారు. యాంప్లిఫైర్‌ని ఎత్తుకుపోయారు. వాహనాన్ని వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవర్‌ తప్పించుకుపోయారు.

ఏం జరిగిందంటే!

లావు శ్రీకృష్ణదేవరాయులు.. పలు మండలాలకు ప్రత్యేకంగా వాహనాలు పంపి.. మైకులు, ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాహనాల్లో కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉండి, నిర్దేశిత ప్రాంతంలో వాహనాన్ని తిప్పి ప్రచారం చేస్తారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామానికి మంగళవారం సాయంత్రం ప్రచార వాహనం చేరుకుంది. ఈ వాహనాన్ని డ్రైవర్‌ కొండా నాయక్‌ రోడ్డుపక్కగా ఆపి ఉంచారు. మైకులు, ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ప్రచారం సాగుతోంది.

ఇంతలో అక్కడకు చేరుకున్న వైసీపీ గూండాలు గొంగటి అంజిరెడ్డి, దేకొండ ఆంజనేయులు, దమ్ము అంజిబాబు.. ‘‘మా అడ్డాకు ఎవడ్రా నిన్ను పంపించింది?’’ అంటూ డ్రైవర్‌ కొండా నాయక్‌ను బయటకు లాగి ప్రశ్నించారు. సమాధానం చెప్పేలోపే దుర్భాషలాడుతూ.. వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో వాహనాన్ని ధ్వంసం చేశారు. విషయాన్ని ఫోన్‌ ద్వారా టీడీపీ నాయకులకు చెప్పేందుకు డ్రైవర్‌ ప్రయత్నించడంతో ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టారు. వాహనానికి ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ను, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై భౌతిక దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోతానని నాయక్‌ బతిమాలినా అరకిలోమీటరు వరకు వెంబడించి మరీ కొట్టారు. ఇంతలో స్థానిక టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని, గూండాలపై రెంటచింతల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


కొనసాగుతున్న అరాచకం

● పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యలు, దాడులు పెరిగిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు పెద్దఎత్తున దాడులకు దిగుతున్నారు.

● మునిసిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరూ కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకొని అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకొన్నారు.

● టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పరిశీలనకు వెళ్లగా తురగా కిశోర్‌ అనే వ్యక్తితో వాళ్లు ప్రయాణిస్తున్న కార్లపై దుంగలతో దాడి చేయించి హతమార్చబోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు టీడీపీ కార్యాలయాన్ని, వాహనాలను దగ్ధం చేశారు.

● వినుకొండకి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాచర్ల నియోజకవర్గంలోని నీలంపాటి అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా అక్కడ కూడా వారిపై దాడి చేశారు. జల్లయ్య అనే టీడీపీ నాయకుడిని నడిరోడ్డుపైనే నరికేశారు.

Updated Date - Apr 10 , 2024 | 08:20 AM