Share News

Kurnool: 'ఈనాడు' పత్రికా కార్యాలయంపై వైసీపీ మూకల దాడి.. ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరుల వీరంగం

ABN , Publish Date - Feb 20 , 2024 | 08:25 PM

కర్నూల్ నగరంలోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు దిగారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు భారీగా అక్కడకు చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు.

Kurnool: 'ఈనాడు' పత్రికా కార్యాలయంపై వైసీపీ మూకల దాడి.. ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరుల వీరంగం

కర్నూలు: కర్నూల్ నగరంలోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు దిగారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు భారీగా అక్కడకు చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం కార్యాలయ తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు.

ఎమ్మెల్యే అనుచరులు కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని.. ఈనాడు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపిస్తూ.. దుండగులు కార్యాలయంపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది.


జగన్ నిజాలు జీర్ణించుకోలేకపోతున్నారు: షర్మిల

పత్రికల్లో వచ్చే నిజాలను అధికార వైసీపీ, సీఎం జగన్(CM Jagan) జీర్ణించుకోలేకపోతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఈనాడు కార్యాలయంపై దాడిని ఆమె ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. కర్నూలులోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి అమానుషమని అన్నారు.

"ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై, ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడులను ఖండిస్తున్నాను. పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తోంది. అందుకు నిదర్శనం ఈ దాడులే. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం, కొట్టి చంపడాలు అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జర్నలిస్టులపై,పత్రికల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యం. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేసినట్లే. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు కోలుకోవడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 08:25 PM