Business : ఔషధాల పరీక్ష కోసం ప్రత్యేక లేబొరేటరీ
ABN , Publish Date - Aug 03 , 2024 | 06:06 AM
రిటైల్ ఫార్మసీ చెయిన్ మెడ్‌ప్లస్.. ఔషధాలను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తోంది. ఈ లేబొరేటరీలో ఔషధాలకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను నిశితంగా పరీక్షించనున్నట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ జీ. మధుకర్ రెడ్డి తెలిపారు.
వచ్చే నెల రోజుల్లో అందుబాటులోకి
నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఔషధాలను అందించటమే లక్ష్యం
మెడ్‌ప్లస్ ఎండీ,సీఈఓ మధుకర్ రెడ్డి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రిటైల్ ఫార్మసీ చెయిన్ మెడ్‌ప్లస్.. ఔషధాలను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తోంది. ఈ లేబొరేటరీలో ఔషధాలకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను నిశితంగా పరీక్షించనున్నట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ జీ. మధుకర్ రెడ్డి తెలిపారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) అనుమతి పొందిన ఈ లేబొరేటరీ వచ్చే నెలన్నర రోజుల్లో అందుబాటులోకి రానుందన్నారు.
వినియోగదారులకు నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యానికి అనుగుణంగా తాము ఈ లేబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు మధుకర్ తెలిపారు. మెడ్‌ప్లస్ బ్రాండ్ పేరుతో ఇప్పటికే పలు ఔషధాలను తమ రిటైల్ ఫార్మసీల ద్వారా విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జెనరిక్ ఔషధాల్లో రక్తపోటు, మధుమేహం, హృద్రోగ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల్లో ఉపయోగించే ప్రిస్కిప్షన్ ఔషధాలతో పాటు ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) ఔషధాలు ఉన్నాయని మధుకర్ వివరించారు.
దేశంలోని అన్ని ప్రధాన ఫార్మా కంపెనీలకు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో జెనరిక్ ఔషధాలను సరఫరా చేసే కాంట్రాక్డ్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ (సీడీఎంఓ)ల నుంచి తాము ఈ ఔషధాలను పొందుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, విండ్‌లాస్ బయోటెక్ సహా మరికొన్ని కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. దీంతో తమ ఫార్మసీ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తున్న ఈ ఔషధాలపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇవ్వగలుగుతున్నట్లు తెలిపారు.
రూ.361 కోట్లు ఆదా..
మెడ్‌ప్లస్ బ్రాండ్ ఔషధాలతో వినియోగదారులు పెద్దఎత్తున లబ్ది పొందుతున్నారని మధుకర్ వివరించారు. గడచిన ఏడాది కాలంలో మెడ్‌ప్లస్ బ్రాండ్ కింద విక్రయుంచిన ఔషధాల విలువ రూ.614 కోట్లుగా ఉండగా అందులో వినియోగదారులు చెల్లించిన మొత్తం రూ.253 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. మెడ్‌ప్లస్ అందించిన డిస్కౌంట్స్‌తో వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఔషధాలపై ఏకంగా రూ.361 కోట్ల మేర లబ్ది పొందారని తెలిపారు.
ప్రస్తుతం తమ జెనరిక్ ఔషధాల పోర్టుఫోలియోలో 433 ఔషధాలు ఉన్నాయన్నారు. త్వరలో ఈ ఔషధ పోర్టుఫోలియోను 900కు చేర్చాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. మెడ్‌ప్ల్‌సలో ప్రస్తుతం 25 లక్షల మంది సభ్యులున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొత్తం రూ.170 కోట్ల విలువైన ఔషధాలను విక్రయించగా రూ.100 కోట్ల మేర వినియోగదారులు లబ్ది పొందారని మధుకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మెడ్‌ప్లస్ దేశవ్యాప్తంగా 4,500 స్టోర్లను నిర్వహిస్తోందన్నారు.
కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 600 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే జూన్ త్రైమాసికంలో కొత్తగా 37 స్టోర్లను ప్రారంభించినట్లు మధుకర్ వివరించారు. కాగా డయాగ్నోస్టిక్స్ సేవలను బిజినెస్ 2 బిజినెస్ (బీ2బీ)కు విస్తరిస్తున్నట్లు మధుకర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.