Loan apps: అనుమతుల్లేకుండా అప్పు ఇస్తే జైలుకే..
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:03 AM
దారుణ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడంతో పాటు అధిక వడ్డీకి అప్పులిచ్చే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టం తీసుకురాబోతోంది.
10 ఏళ్ల వరకు కారాగార శిక్ష
8 రూ. కోటి వరకు జరిమానా
8 దా‘రుణ’ యాప్‌లను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: దారుణ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడంతో పాటు అధిక వడ్డీకి అప్పులిచ్చే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టం తీసుకురాబోతోంది. అనుమతుల్లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ మార్గం లో రుణాలిచ్చే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించేందుకు కొత్త బిల్లును ప్రతిపాదించింది. అనియంత్రిత రుణ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోవడంతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ 2021 నవంబరులో తన నివేదికను సమర్పించింది. అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతోపాటు పలు చర్యలను వర్కింగ్ గ్రూప్ సూచించింది. ఆర్‌బీఐ లేదా ఇతర నియంత్రణ మండళ్లతో పాటు ఏదైనా చట్ట ప్రకారంగా రుణ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతి లేని వ్యక్తులు లేదా సంస్థలను నిషేధించాలని ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించింది.
నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక, డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను (బంధువులకిచ్చే రుణాలు మినహా) అనియంత్రిత రుణ వ్యాపారంగా బిల్లు నిర్వచించింది. నియమావళికి విరుద్ధంగా రుణాలిచ్చే వారికి కనీసం 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించనున్నట్లు బిల్లులో ప్రతిపాదించారు. రుణగ్రహీతలను వేధించడం లేదా అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి పాల్పడేవారికి 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అనియంత్రిత రుణదాత, రుణగ్రహీతలు, ప్రాపర్టీలు పలు రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పక్షంలో లేదా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే స్థాయి సొమ్ముకు సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.
బ్యానింగ్ ఆఫ్ అన్‌రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (బీయూఎల్‌ఏ) పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నాటికి సూచనలు, అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న అమాయకులు దారుణ యాప్‌ల వలలో పడి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావడం లేదా రుణ యాప్‌ల వేధింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన పలు సంఘటనలు అనేకం. దాంతో కేంద్ర ప్రభుత్వం మోసపూరిత రుణ యాప్‌ల ప్రచారాలు లేదా ప్రకటనలు తమ వేదికలో లేకుండా చూడాలని సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ను గతంలో ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి గూగుల్ 2022 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టు మధ్య కాలంలో 2,200 మోసపూరిత రుణ యాప్‌లను తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దేశంలో అక్రమంగా డిపాజిట్ల సమీకరణ కార్యకలాపాలు, పోంజీ స్కీమ్‌లను అడ్డుకునేందుకు కేంద్రం 2019లో అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది.