Union Budget 2024-25: ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 23 , 2024 | 12:01 PM
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా 3 ప్రోత్సాహక పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా 3 ప్రోత్సాహక పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వ్యక్తులకు తొలి జీతాన్ని కేంద్ర ప్రభుత్వమే అందించనుంది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రకటన వెలువడింది. ఈ పథకం అన్ని అధికారిక రంగాలలోనూ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
ఇంటర్న్‌షిప్ అలవెన్స్‌గా రూ.5,000, ఒకే దఫా సాయంగా రూ. 6,000 మొత్తాన్ని కలిపి ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ పథకం కింద 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఇక తయారీ రంగంలో ఉద్యోగాలు సృష్టించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం ఉద్యోగులు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో మార్గదర్శకాలను ప్రకటించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
ఇక మూడవ పథకంగా అన్ని రంగాలలో అదనపు ఉపాధి కల్పనకు మద్దతు అందించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 50 లక్షల మందికి అదనపు ఉపాధిని ప్రోత్సహించే పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు.
4.1 కోట్ల మంది యువతపై దృష్టి పెట్టేందుకు ఐదు పథకాలను ప్రవేశపెట్టనున్నామని, ఇందుకోసం ఏకంగా రూ.2 లక్షల కోట్ల వ్యయం కేటాయించనున్నట్టు సీతారామన్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.
కాగా దేశ అభివృద్ధికి తొమ్మిది ప్రాధాన్య అంశాలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేశామని సీతారామన్ వివరించారు. వ్యవసాయం, ఉపాధి, సమగ్రాభివృద్ధి, తయారీ, సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధనం, మౌలిక వసతులు, ఆవిష్కరణ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, తదుపరి తరం సంస్కరణలను ప్రాధాన్య అంశాలుగా గుర్తించామని చెప్పారు.