GST: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. మందులపై జీఎస్టీ తగ్గింపు
ABN , Publish Date - Sep 09 , 2024 | 09:46 PM
క్యాన్సర్ రోగులు వాడే మందులపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీ: క్యాన్సర్ రోగులు వాడే మందులపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్.. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. క్యాన్సర్ మందులతో పాటు స్నాక్స్‌పై జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థలను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామన్నారు.
క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12శాతం నుంచి 5 శాతానికి తగ్గించామని చెప్పారు. ఇక కొన్ని తినుబండారాలపై పన్నును 18శాతం నుంచి 12శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ ఆదాయం ఆరు నెలల్లో 412శాతం పెరిగి రూ.6 వేల909 కోట్లకు చేరుకుందని, రేట్ల హేతుబద్ధీకరణపై జీఓఎం స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సి ఉందని వివరించారు.
ఆరోగ్య బీమాపై..
రియల్ ఎస్టేట్, రేట్ల హేతుబద్ధీకరణపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉందన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోల స్థితిగతులను సమావేశంలో ప్రదర్శించామన్నారు. "క్యాసినో ఆదాయం 30శాతం పెరిగింది. ఆరోగ్య బీమాపై మంత్రుల బృందం అక్టోబర్ చివరి నాటికి నివేదికను సమర్పిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య బీమాపై జీఎస్టీని ఎత్తివేసే నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశాం. ఆరోగ్య బీమాపై రేటును అంచనా వేయడానికి జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ మంత్రుల బృందం అక్టోబర్ చివరి నాటికి నివేదిక అందిస్తుంది"అని నిర్మలా వెల్లడించారు. తీర్థయాత్రల కోసం హెలికాప్టర్ సేవల నిర్వహణపై పన్ను ఐదు శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఉత్తరాఖండ్ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర మతపరమైన తీర్థయాత్రలకు భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సేవలపై 18శాతం నుంచి 5శాతానికి పన్ను తగ్గించామన్నారు. వివిధ వర్గాల ప్రజలకు ఉపయోగపడేవిధంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. దీంతోపాటు 2026 మార్చి తర్వాత జీఎస్టీ సెస్ కొనసాగింపుపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.
For Latest News and National News Click Here