Stock Markets: దేశీయ మార్కెట్లపై అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం
ABN , Publish Date - Nov 06 , 2024 | 10:45 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతుండడం భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది. దేశీయ ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.20 గంటల సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్లు లేదా 0.66 శాతం మేర లాభపడి 80,003.50 పాయింట్ల వద్ద కదలాడుతోంది.
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల సరళిని గమనిస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేజిక్ ఫిగర్ 270 దిశగా ఆయన దూసుకెళ్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయానికి ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. 205 ఎలక్టోరల్ ఓట్లతో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వెనుకబడ్డారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతుండడం భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది.
దేశీయ ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.20 గంటల సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్లు లేదా 0.66 శాతం మేర లాభపడి 80,003.50 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 154.40 పాయింట్లు లేదా 0.64 శాతం మేర వృద్ధి చెంది 24,367.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ-50 సూచీలో 38 షేర్లు లాభాలతో ప్రారంభమవ్వగా.. 12 షేర్లు నష్టాల్లో ఆరంభమయ్యాయి. క్రితం సెషెన్‌లో సెన్సెక్స్ 79,476.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,213.30 పాయింట్ల వద్ద ముగిశాయి.
అనిశ్చితికి అవకాశం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పూర్తి ఫలితాలు వెల్లడికావడానికి మరింత సమయం పట్టొచ్చు కాబట్టి మార్కెట్లలో అస్థిరత మరింత పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు. మదుపర్లు తమ పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతి వార్తకూ మార్కెట్లు స్పందిస్తుంటాయని బ్యాంకింగ్, మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా అభిప్రాయపడ్డారు. మార్కెట్లకు ఇది ఎన్నికల వారంగా మారవచ్చన్నారు. అస్థిరతకు అవకాశాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లు కనీసం ఈ ఒక్క రోజు వేచిచూడడం ఉత్తమమని అజయ్ బగ్గా సూచించారు. కాగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే
ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే
అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు
For more International News and Telugu News