Stock market : బిజినెస్ మదుపరి షాక్.. సూచీలు షేక్
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:25 AM
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌ను భారీగా కుదిపేశాయి. ఎన్‌డీఏకు సీట్లు 300 కంటే తగ్గడంతోపాటు బీజేపీకి పూర్తి మెజారిటీ లభించకపోవడం మార్కెట్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించడంతో మంగళవారం సూచీలు కుప్పకూలాయి. నాలుగేళ్లలో అతిపెద్ద నష్టాన్ని
‘పోల్’ పంచ్‌కు రక్తమోడిన దలాల్‌స్ట్రీట్
ఒకదశలో 6,234 పాయింట్లు పతనమై 70,000 స్థాయికి జారుకున్న సెన్సెక్స్
చివరికి 4,390 పాయింట్ల నష్టంతో 72,079 స్థాయి వద్ద ముగిసిన సూచీ
ఇంట్రాడేలో నిఫ్టీ దాదాపు 2,000 పాయింట్లు డౌన్
చివర్లో 1,379 పాయింట్ల నష్టంతో 21,885 వద్ద క్లోజ్
గడిచిన నాలుగేళ్లలో ఇదే అతిపెద్ద మార్కెట్ పతనం
ఒకదశలో దాదాపు రూ.40 లక్షల కోట్ల సంపద ఉఫ్
రూ.31 లక్షల కోట్ల నష్టంతో రూ.394.83 లక్షల కోట్లకు
పడిపోయిన బీఎ్‌సఈ మార్కెట్ క్యాపిటలైజేషన్
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌ను భారీగా కుదిపేశాయి. ఎన్‌డీఏకు సీట్లు 300 కంటే తగ్గడంతోపాటు బీజేపీకి పూర్తి మెజారిటీ లభించకపోవడం మార్కెట్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించడంతో మంగళవారం సూచీలు కుప్పకూలాయి. నాలుగేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. దాంతో ఎగ్జిట్ పోల్స్ జోష్‌తో సోమవారం ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ ఒకదశలో 6,234.35 పాయింట్ల (8.15 శాతం) వరకు క్షీణించి దాదాపు 5 నెలల కనిష్ఠ స్థాయి 70,234.43 వద్దకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న సూచీ.. చివరికి 4,389.73 పాయింట్ల (5.74 శాతం) నష్టంతో రెండు నెలలకు పైగా కనిష్ఠ స్థాయి 72,079.05 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 1,982.45 పాయింట్లు (8.52 శాతం) పతనమై 21,281.45 వద్దకు పడిపోయింది. ట్రేడింగ్ నిలిచేసరికి సూచీ 1,379.40 పాయింట్ల (5.93 శాతం) నష్టంతో 21,884.50 వద్ద స్థిరపడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో 2020 మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీ 13 శాతం మేర క్షీణించాయి. ఆ తర్వాత సూచీలకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం. అమ్మకాల సునామీలో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయి రూ.394.83 లక్షల కోట్లకు (4.73 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఒకదశలోనైతే మార్కెట్ సంపద దాదాపు రూ.40 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
మరిన్ని ముఖ్యాంశాలు..
ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, పవర్, యుటిలిటీస్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. పలు ప్రభుత్వ రంగ షేర్లు పరిమితికి మించి పతనమవడంతో వాటిల్లో ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
సెన్సెక్స్‌లోని 30 లిస్డెడ్ కంపెనీల్లో 27 నష్టపోయాయి. ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీ షేరు 15 శాతానికి పైగా క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్ సైతం రెండంకెల స్థాయిలో నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం హెచ్‌యూఎల్ మాత్రం 6 శాతం లాభపడి సెన్సెక్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. నెస్లే ఇండియా 3 శాతానికి పైగా పెరిగింది.
బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్ సూచీ 8.07 శాతం క్షీణించగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 6.79 శాతం నష్టపోయింది. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ నేలచూపులు చూశాయి. యుటిలిటీస్ 14.40 శాతం, పవర్ 14.25 శాతం పతనమవగా.. ఆయిల్ అండ్ గ్యాస్ 13.07 శాతం, సర్వీసెస్ 12.65 శాతం, క్యాపిటల్ గూడ్స్ 12.06 శాతం, ఎనర్జీ 11.62 శాతం నష్టపోయాయి.
బీఎ్‌సఈలో 3,934 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,349 కంపెనీల స్టాక్ నష్టాలు చవిచూశాయి. 488 మాత్రం లాభపడ్డాయి. 97 యథాతథంగా ముగిశాయి. కాగా, 292 కంపెనీల షేర్లు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోగా.. 139 ఏడాది గరిష్ఠాన్ని చేరాయి.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 37 పైసలు క్షీణించి 83.51 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమైంది.
అదానీ షేర్లు ఢమాల్ : నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహిత కార్పొరేట్ ప్రముఖుడిగా పేరున్న గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ షేర్లు మహా పతనాన్ని చవిచూశాయి. ఇంట్రాడేలో అదానీ పోర్ట్స్ 25 శాతం వరకు క్షీణించింది. పలు కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దాంతో గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ సంపద ఒక్కరోజులోనే రూ.3.64 లక్షల కోట్లు తగ్గి రూ.15.78 లక్షల కోట్లకు పడిపోయింది.
పీఎ్‌సయూ స్టాక్స్ పరేషాన్ : ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎ్‌సయూ), ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల(పీఎ్‌సబీ) షేర్లు భారీగా కుదేలయ్యాయి. ఆర్‌ఈసీ షేరు ఏకంగా 24.07 శాతం క్షీణించగా.. పీఎ్‌ఫసీ 21.62 శాతం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 19.43 శాతం, భారత్ ఎలకా్ట్రనిక్స్ 19.21 శాతం, ఓఎన్‌జీసీ 16.23 శాతం, కోల్ ఇండియా 13.54 శాతం, ఎన్‌టీపీసీ 14.52 శాతం నష్టపోయాయి. దాంతో నిఫ్టీ పీఎ్‌సఈ ఇండెక్స్ 16.38 శాతం పతనమై 9,475 స్థాయికి జారుకుంది. పీఎ్‌సబీలదీ అదే పరిస్థితి. యూనియన్ బ్యాంక్ 17.65 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 15.15 శాతం చొప్పున నష్టపోయాయి. కెనరా బ్యాంక్ 13.45 శాతం, ఎస్‌బీఐ 13.37 శాతం తగ్గాయి. దాంతో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్స్ 15.14 శాతం దిగజారి 6,794.25 వద్దకు పడిపోయింది. పీఎ్‌సబీలతోపాటు ప్రైవేట్ బ్యాంక్‌లూ భారీ నష్టాలను చవిచూశాయి. దాంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ 7.95 శాతం క్షీణించి 46,928.60 వద్దకు జారుకుంది.