Share News

Stock Market: దేశీయ సూచీల లాభాల జోరు.. మళ్లీ 80 వేల ఎగువకు సెన్సెక్స్..

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:18 PM

వరుసగా నష్టాలను చవిచూస్తున్న మార్కెట్లు సోమవారం లాభాల జోష్‌లో పయనించాయి. బేర్ పట్టును తప్పించుకుని లాభాల బాట పట్టాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడం, ఆసియా మార్కెట్ల పాజిటివ్ ర్యాలీ దేశీయ సూచీలకు కలిసి వచ్చింది.

Stock Market: దేశీయ సూచీల లాభాల జోరు.. మళ్లీ 80 వేల ఎగువకు సెన్సెక్స్..
Stock Market

వరుసగా నష్టాలను చవిచూస్తున్న మార్కెట్లు సోమవారం లాభాల జోష్‌లో పయనించాయి. బేర్ పట్టు నుంచి తప్పించుకుని లాభాల బాట పట్టాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడం, ఆసియా మార్కెట్ల పాజిటివ్ ర్యాలీ దేశీయ సూచీలకు కలిసి వచ్చింది. దీంతో సోమవారం రోజంతా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే కొనసాగాయి. దీంతో గత వారం 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ మళ్లీ కోలుకుంది. 80 వేలకు పైన రోజును ముగించింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించి లాభాలు అందుకుంది (Business News).


శుక్రవారం ముగింపు (79, 402)తో పోల్చుకుంటే 250 పాయింట్ల లాభంతో 79, 653 వద్ద సోమవారం ప్రారంభమైన సెన్సెక్స్ ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఒకదశలో 1100 పాయింట్లకు పైగా ఎగబాకింది. 80, 539 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే చివర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో దిగి వచ్చింది. అయినా 600 పాయింట్లకు పైగా లాభంతో రోజును ముగించింది. సెన్సెక్స్ సోమవారం 602 పాయింట్ల లాభంతో 80, 005 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 70 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. ఒకదశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 158 పాయింట్ల లాభంతో 24, 339 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో బంధన్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, కెనరా బ్యాంక్, హిందుస్తాన్ కాపర్ షేర్లు లాభాలు అందుకున్నాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, చోలా ఇన్వెస్ట్, మహానగర్ గ్యాస్, కోల్ ఇండియా నష్టాలు మూటగట్టుకున్నాయి. వరుసగా నష్టాలు ఎదుర్కొన్న మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు 458 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 471 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 28 , 2024 | 04:18 PM