Stock Market: నష్టాల నుంచి లాభాల్లోకి.. తీవ్ర ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Oct 23 , 2024 | 10:40 AM
మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు బుధవారం ఉదయం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి.
యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు బుధవారం ఉదయం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది (Business News).
మంగళవారం ముగింపు (80, 220)తో పోల్చుకుంటే 300 పాయింట్ల నష్టంతో 79, 921 వద్ద బుధవారం ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో వంద పాయింట్లు కోల్పోయింది. వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయింది. అయితే ఆ తర్వాత మదుపర్ల కొనుగోళ్ల కారణంగా లాభాల్లోకి దూసుకెళ్లింది. కనిష్టం నుంచి ఏకంగా 500 పాయింట్లు లాభపడి 80, 481 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:30 గంటలకు 69 పాయింట్ల లాభంతో 80, 290 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 100 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ఆ తర్వాత కోలుకుని ప్రస్తుతం 33 పాయింట్ల లాభంతో 24, 505 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో కోఫోర్జ్ లిమిటెడ్, పెర్సిస్టెంట్, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. ఛంబల్ ఫెర్టిలైజర్స్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్సియల్స్, ఎన్టీపీసీ, ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంక్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. వరుసగా నష్టాలు ఎదుర్కొంటున్న మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 426 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..