Share News

Stock Market: తప్పని నష్టాలు.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..

ABN , Publish Date - Nov 11 , 2024 | 10:28 AM

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, ఈ వారంలో వెల్లడి కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది.

Stock Market: తప్పని నష్టాలు.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..
Stock Market

గత వారం నష్టాలతో ముగిసిన సూచీలు ఈ వారాన్ని కూడా అదే ధోరణిలో ప్రారంభించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవన కాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ మదుపర్లు చైనా వైపు నిధులు మళ్లిస్తుండడం వంటి కారణాలతో దేశీయ సూచీలకు నష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, ఈ వారంలో వెల్లడి కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారి ప్రస్తుతం కోలుకుంటోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నష్టాల్లో కదలాడుతోంది (Business News).


శుక్రవారం ముగింపు (79, 486)తో పోల్చుకుంటే దాదాపు 180 పాయింట్ల నష్టంతో 79, 298 వద్ద సోమవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో ఏకంగా 480 పాయింట్లు కోల్పోయి 79, 001 వద్ద కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టంతో 79, 451 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఒక దశలో 140 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 24, 138 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎమ్‌ఆర్‌ఎఫ్, బయోకాన్, ఇన్ఫో‌ఎడ్జ్ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, కమిన్స్, దీపక్ నైట్రేట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 419 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.38గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 11 , 2024 | 10:28 AM