Stock Market: అనిశ్చితిలో దేశీయ సూచీలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
ABN , Publish Date - Nov 12 , 2024 | 10:22 AM
మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఆ లాభాలను కోల్పోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవన కాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ మదుపర్లు చైనా వైపు నిధులు మళ్లిస్తుండడం, ఈ వారంలో ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండడం వంటి కారణాలతో దేశీయ సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఆ లాభాలను కోల్పోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది (Business News).
సోమవారం ముగింపు (79, 496)తో పోల్చుకుంటే దాదాపు 150 పాయింట్ల లాభంతో 79, 644 వద్ద మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ మరో 200 పాయింట్ల ఎగబాకి 79,820 వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆరంభ లాభాలను కోల్పోయింది. ఒక దశలో గరిష్టం నుంచి ఏకంగా 400 పాయింట్లు కోల్పోయి 79, 439 వద్ద కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 79, 586 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా లాఢపడింది. ప్రస్తుతం 24 పాయింట్ల లాభంతో 24, 166 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో జుబిలెంట్ ఫుడ్స్, యూపీఎల్, ఎల్ అండ్ టీ టెక్నాలజీస్, ఇప్కా ల్యాబ్స్ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. ఐజీఎల్, ఏబీబీ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ, గెయిల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 172 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 87 పాయింట్ల లాభాంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.39గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..